రీపోల్‌ అవసరమే రాకూడదు

రీపోల్‌ అవసరమే రాని ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌

పోలాకి : పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలాని సమూన్‌

ప్రజాశక్తి- పోలాకి, సారవకోట, జలుమూరు

రీపోల్‌ అవసరమే రాని ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల కమిషన్‌ పనిచేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌ అన్నారు. సారవకోట, జలుమూరు, పొలాకి మండలాల్లో గురువారం పర్యటించారు. ఆయా మండలాల తహశీల్దార్‌ కార్యాలయల్లో ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీశారు, జలుమూరు, పొలాకి మండలాల్లో పోలింగ్‌స్టేషన్లను సందర్శించారు, అలాగే జలుమూరులో ఎఫ్‌ఎస్టి బృందాల పనితీరును పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు కీలక సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. హింసకు తావు లేకుండా, ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా (జీరో వయలెన్స్‌.. నో రీపోల్‌), పూర్తి స్వేచ్ఛగా, సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరన్నారు. అలాగే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు, ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ఎన్నికలు నియమావళి పకడ్బందీగా అమలు చేయాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల ముందుగానే గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఒ జె.వి.ఎస్‌.రామ్మోహనరావు, పోలాకి తహశీల్దార్‌ ప్రసాదరావు, పోలాకి ఎస్‌ఐ సత్యనారాయణ, సూపరింటెండెంట్‌ సూర్యప్రకాష్‌, డిటి పి.శ్రీనివాసరావు, బిఎల్‌ఒ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

 

➡️