వినతులు స్వీకరిస్తున్న డిఆర్‌ఒ గణపతిరావు
- ‘స్పందన’లో రైతుల వినతి
- 175 వినతులు స్వీకరణ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగికి చెందిన భూములను రీ సర్వే పేరుతో కొందరు అక్రమ పద్ధతిలో హక్కు పత్రాలను సృష్టించారని ఆ గ్రామానికి చెందిన రైతులు దానేసు, అప్పలరాముడు, సుధారాణి, నరసమ్మతో పాటు పలువురు రైతులు స్పందనలో ఫిర్యాదు చేశారు. దశాబ్ద కాలంగా న్యాయపరిధిలో పోరాడి విజయం సాధించిన రైతులను కాదని కొందరు పెత్తందారులకు హక్కును కల్పిస్తూ రెవెన్యూ సిబ్బంది పత్రాలు ఇచ్చారని తెలిపారు. వారి హక్కు పత్రాలను తక్షణమే రద్దు చేసి, సాగులో ఉన్న రైతులకు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. నగరంలోని జిల్లాపరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా పలు సమస్యలపై 175 వినతులు వచ్చాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయదేవి వినతులను స్వీకరించారు. కొత్తూరు మండల కేంద్రానికి సమీపాన పూర్వీకుల నుంచి తనకు 70 సెంట్ల విస్తీర్ణం గల భూమి ఉందని, తాను శ్రీకాకుళంలో ప్రస్తుతం నివాసం ఉండడం వల్ల స్థానికులు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారని గురిటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. హిరమండలం మండలం గూనభద్రకు చెందిన ముద్దాడ రాజేశ్వరరావు తనకున్న 86 సెంట్ల విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని వంశధార ప్రాజెక్టు అవసరార్థం ప్రభుత్వం తీసుకున్నా, ఇంతవరకు తనకు నష్టపరిహారం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. వినతుల స్వీకరణ అనంతరం డిఆర్‌ఒ గణపతిరావు మాట్లాడుతూ స్పందనలో వచ్చిన వినతులపై అలసత్వం లేకుండా సత్వరం పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, డిఇఒ వెంకటేశ్వరరావు, వంశధార ఎస్‌ఇ డోల తిరుమలరావు, ఉద్యానశాఖ ఎడి ఆర్.వి ప్రసాదరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి, సమగ్ర శిక్ష ఎపిసి ఆర్.జయప్రకాష్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.