వైసిపికి కౌంట్‌డౌన్‌ మొదలు

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని

సమావేశంలో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు

  • టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు

ప్రజాశక్తి – కోటబొమ్మాళి, ఆమదాలవలస

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళిలోని టిడిపి కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమంతో ప్రజలకు గ్యారంటీ వచ్చిందన్నారు. మండల నాయకులు మరింత శ్రద్ధ చూపిస్తే త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలమని చెప్పారు. టిడిపి అవిర్భావం నుంచి ఎన్నో ఎన్నికలు, ఎంతోమంది సిఎంలను చూశామని, ప్రజల భవిష్యత్‌ను నాశనం చేసిన దుర్మార్గమైన సిఎం జగన్మోహన్‌రెడ్డి అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పోటీ కాదని, ఐదు కోట్ల ప్రజలకు, జగన్మోహన్‌రెడ్డికి మధ్య పోటీ జరుగుతుందని తెలిపారు. నాలుగున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అథ:పాతాళానికి తొక్కిన శని ఎప్పుడు పోతుందా అని ఐదు కోట్ల ప్రజానీకం ఎదురుచూస్తోందని చెప్పారు. ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అందులో 38 శాతం మాత్రమే నెరవేర్చారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలు, దళితులు, గిరిజనులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికొదిలి, ఇప్పుడు ఎన్నికల ముందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటే ఏప్రిల్‌లో పోస్టులు తీశామని చెప్తున్నారని, సిఎం ఆయువు మార్చి వరకే అయితే ఏప్రిల్‌లో ఎలా ఇస్తారని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికడంతో అభ్యర్థులను మార్చుతూ కొత్త నాటకానికి తెరతీశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి 160 స్థానాలకు కైవసం చేసుకుంటుందని చెప్పారు. ఉద్దానానికి ఎంతో ఉద్దరిస్తున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకోవడానికి సిగ్గుండాలన్నారు. టిడిపి హయాంలో పలాసలో ఐదెకరాల స్థల సేకరణ చేసి, తానే భూమి పూజ చేశానని, ఆ నిధులతో ఆస్పత్రిని పూర్తి చేసి ఇప్పుడు జగన్‌ హడావుడి చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే శ్రీకాకుళం, పాలకొండ, ఇచ్ఛాపురం, కవిటి, పలాస, టెక్కలిలో డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్దాన నీటి పథకాన్ని నాడు ఎర్రన్నాయుడు తీసుకొస్తే, ఆ ట్యాంకులకు కేంద్ర ప్రభుత్వం సుజలధార ద్వారా నీరు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు. టిడిపి హయాంలో 16 ఎత్తుపోతల పథకాల ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తే, వైసిపి పాలనలో వాటిని వినియోగించడం చేతకాక జిల్లాను కరువు జిల్లాగా మార్చారని దుయ్యబట్టారు. జిల్లాలో ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రకటించకపోవడం జిల్లాలోని మంత్రులు, వైసిపి నాయకుల అసమర్థతకు నిదర్శనమన్నారు. సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బోయిన గోవిందరాజులు, పినకాన అజరుకుమార్‌, బగాది శేషగిరి, బోయిన రమేష్‌, జీరు భీమారావు, వి.కామేశ్వరరావు, టి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.యువగళం ఎన్నికల శంఖారావానికి తరలిరావాలియువగళం ముగింపు సభకు వేలాది మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని మాజీ మంత్రి కె.ఎస్‌ జవహర్‌ పిలుపునిచ్చారు. ఆమదాలవలస మండలం కోర్లకోట రోడ్డులోని ఒక ఫంక్షన్‌హాల్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం పోలిపల్లి భూమాత వెంచర్‌లో యువగళం ముగింపు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. యువగళం పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటమి ఖాయమన్నారు. సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్‌, నాయకులు మొదలవలస రమేష్‌, తమ్మినేని విద్యాసాగర్‌, సనపల ఢిల్లేశ్వరరావు, నూక రాజు, ఆనెపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

➡️