సంతకాల సమర్పణ భగ్నానికి యత్నం

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు

ఇచ్ఛాపురం : అంగన్వాడీ యూనియన్‌ నాయకులు హైమను అరెస్టు చేస్తున్న పోలీసులు

  • విజయవాడ వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు
  • పలువురు అంగన్వాడీల అరెస్టు, గృహ నిర్బంధం

ప్రజాశక్తి – ఇచ్ఛాపురం, సోంపేట, కంచిలి, పొందూరు, కోటబొమ్మాళి

కనీస వేతనం రూ.26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన అంగన్వాడీలు 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, వారి సమస్యలను సంతకాల రూపంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంపైనా నిర్బంధాన్ని ప్రయోగించింది. ఈనెల 22న విజయవాడలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి కోటి సంతకాలను సమర్పించే కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. కోటి సంతకాల సమర్పణకు విజయవాడ వెళ్లవద్దంటూ పోలీసులు అంగన్వాడీలకు ఫోన్లు చేసి చెప్పారు. అయినా విజయవాడ వెళ్లేందుకు సిద్ధమవుతున్న అంగన్వాడీలను ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ వద్ద సిఐ ఇమాన్యుయేల్‌ రాజు, పట్టణ ఎస్‌ఐ గోవిందరావు ఆధ్వర్యాన పోలీసులు అడ్డుకున్నారు. అంగన్వాడీలను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారు ప్రతిఘటించారు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు బస్టాండ్‌ వద్ద రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్‌లో వాహనాలు చిక్కుకున్నాయి. చివరకు అంగన్వాడీలను పోలీస్‌స్టేషన్‌కు తరలించగా, అక్కడ వారు ఆందోళన చేపట్టారు. అనంతరం వారిని ఇంటికి పంపించారు. అంగన్వాడీలు విజయవాడ వెళ్లకుండా రూరల్‌ ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యాన సిబ్బంది రైల్వేస్టేషన్‌ వద్ద నిఘా పెట్టారు. సోంపేటలో 39 మంది అంగన్వాడీలు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కంచిలిలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు మోహినితో పాటు పలువురికి నోటీసులు జారీ చేసి గృహ నిర్బంధం చేశారు. పొందూరులో పలువురిని గృహ నిర్బంధం చేసి విజయవాడ సంతకాల సమర్పణకు వెళ్లడం లేదంటూ నోటీసులపై సంతకాలు చేయించారు. అంగన్వాడీలకు ఫోన్లు చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలిచినా వారు వెళ్లకపోవడంతో, పోలీసులే వారి ఇళ్లకు వచ్చారు. కొంతమంది ఇళ్ల వద్ద లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలంఅంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ విమర్శించారు. కోటబొమ్మాళి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు కార్యాలయ అవరణలో సమ్మె శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 41 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి వీడి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమ్మె సమంజసమైందని, నాలుగేళ్లుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్ధంగా సమ్మె చేపట్టారని తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచకపోతే జీవనం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. అంగన్వాడీల సమ్మెపై ఎస్మా ప్రయోగిస్తూ జిఒ నంబరు 2ను ప్రభుత్వం జారీ చేయడం, నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడడం సరికాదన్నారు. అంగన్వాడీలకు ఎస్మా వర్తించదని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీని అమలు చేయాలన్నారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఒ ఇవ్వాలన్నారు.

 

➡️