‘మీకోసం’కు 141 వినతులు

జిల్లాలో సుదీర్ఘకాలం తర్వాత ప్రజా సమస్యల

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌, జెసి

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

జిల్లాలో సుదీర్ఘకాలం తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం సోమవారం నిర్వహించారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ ఎం.వెంకటేశ్వరరావులు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సామాజిక, వ్యక్తిగత సమస్యలతో కూడిన 141 వినతులు స్వీకరించారు. స్వీకరించిన వినతుల్లో పెద్దపాడు-తంగివానిపేటకు చెందిన దళితులకు పెద్దపాడు గ్రామ సమీపాన 1976లో సర్వే నంబరు 68-2లో లోపింటి రామయ్యకు ప్రభుత్వం డీపట్టా మంజూరు చేసిందని అన్నారు. ఆ భూములు 2018 వరకు ఆయన స్వాధీనంలో ఉన్న భూమిని వేరొకరు ఆక్రమించుకున్నారంటూ అతని వారసులు అప్పయ్య, సవలాపురపు అప్పన్న, పుట్టా ఇందుమతిలు ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురం మండలం మండపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రం మంజూరైందని, కానీ, ఆ గ్రామానికి బస్‌ సౌకర్యం లేక పోవడంతో విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తోందని సర్పంచ్‌ ప్రతినిధి పిట్టా మామయ్య వివరించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఆర్‌టిసి బస్‌ నడపాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కేంద్రానికి కొళిగాం, బిర్లంగి, రత్తకన్న హైస్కూళ్ల నుంచి విద్యార్థులు పరీక్ష రాసేందుకు వస్తున్నారని వివరించారు. ఈ గ్రామానికి తక్షణమే ఆర్‌టిసి బస్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ జిల్లా ప్రజా రవాణాధికారి విజయకుమార్‌ను ఆదేశించారు. కొత్తూరు. మండలం మెట్టూరు కు చెందిన బత్తిలి జయమ్మకు 144 -1 సర్వే నంబరులో మూడు సెంట్లు ఇంటి స్థలం తరగాన సింహాచలం ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని మండల సర్వేయర్‌ పాత తేదీలతో పొజిషన్‌ ధ్రువపత్రాన్ని వేరొకరి పేరుతో జారీ చేశారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరారు. గార మండలం అంబళ్లవలస, పూసర్లపాడు, సాలి హుండం సాగునీటి కాలువలను మరమ్మతు లు చేపట్టి నీటి సరఫరాకు వీలు కల్పించాలని కొంక్యాన ఆదినారాయణ కోరారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతి, డిఆర్‌డిఎ పీడీ కిరణ్‌ కుమార్‌, జెడ్‌పి సిఇఒ ఎల్‌.ఎన్‌.వి.శ్రీధర్‌రాజు పాల్గొన్నారు.

 

➡️