వంశధార ప్రాజెక్టు ఆధునికీకరణకురూ.1500 కోట్లు కేటాయించాలి

వంశధార ప్రాజెక్టు ఆధునికీకరణకు

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు

నిపుణులు చెప్తున్నా నిర్లక్ష్యం తగదు

నదీ జలాల వినియోగంతో జిల్లా అభివృద్ధి

సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు

ప్రజాశక్తి – శ్రీకాకుళం

వంశధార ప్రాజెక్టు ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు వెంటనే కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వంశధార ప్రాజెక్టు జిల్లా అభివృద్ధికి గుండెకాయ వంటిదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మించి 50 ఏళ్లు కావస్తుండడంతో శిథిలావస్థకు చేరుకుందని చెప్పారు. ఇదే శిథిలమైతే జిల్లాలో వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. వంశధార నది ఎడమ కాలువ ద్వారా 1.50 లక్షల ఎకరాలు, కుడి కాలువ ద్వారా 80 వేల ఎకరాలు, హై లెవల్‌ కెనాల్‌ ద్వారా ఐదు వేల ఎకరాలు, ఫ్లడ్‌ ఫ్లో కెనాల్‌ ద్వారా 20 వేల ఎకరాలకు నీరందుతుందని తెలిపారు. వంశధార ప్రాజెక్టు నిర్వహణకు నిధుల్లేక శిథిలావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న వంశధార ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. వంశధార ఆధునికీకరణ కోసం కుడి కాలువ 104 కిలోమీటర్లు, ఎడమ కాలువ 73 కిలోమీటర్ల పొడవునా లైనింగ్‌ చేయడం కోసం రూ.800 కోట్లు, 250 స్ట్రక్చర్స్‌ పునర్నిర్మాణం కోసం రూ.300 కోట్లు, షట్టర్ల కోసం రూ.వంద కోట్లు, పిల్ల కాలువల మరమ్మతుల కోసం రూ.300 కోట్లు అవసరమవుతాయని నిపుణులు చెప్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పాలకుల నిర్లక్ష్యమే జిల్లా వెనుకబాటుకు కారణమన్నారు. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ చేసి రెండు పంటలకు నీరు ఇస్తే వ్యవసాయ రంగం నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వస్తుందని చెప్పారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయన్నారు. వలసలు నివారించి జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎస్‌ఐఎంపి (సపోర్ట్‌ ఫర్‌ ఇంఫ్రూవ్‌మెంట్‌ అండ్‌ మోడరైజేషన్‌ ఆఫ్‌ ప్రాజెక్టు) నుంచి వంశధార బ్యారేజీ ఆధునీకరణ కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఎందుకు నిధులు తేవడం లేదని ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే వంశధార బ్యారేజీని ఆధునీకరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అభివృద్ధి అంటే ప్రజల ఆస్తులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడం కాదని, నదీ జలాలను వినియోగించుకోవడమని స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్టు ఆధునీకరణ కోసం దశల వారీ పోరాటాలు చేస్తామన్నారు.

 

➡️