స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కలెక్టర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
రాష్ట్ర ప్రభుత్వం 2025-26 షెడ్యూల్డ్ కులాల వార్షిక ప్లాన్ అమల్లో భాగంగా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రూ.18.74 కోట్ల రుణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 450 మంది లబ్ధిదారులకు రూ.18.74 కోట్ల రుణాలను మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో బ్యాంకుల ద్వారా రూ.10.40 కోట్లు, ప్రభుత్వ రాయితీ రూ.7.40 కోట్లు, లబ్ధిదారుల వాటా రూ.93.74 లక్షలు ఉంటాయని తెలిపారు. ఈ పథకం కింద ట్రాన్స్‌పోర్టు రంగంలో 137 మందికి, పారిశ్రామిక, సేవా, వ్యాపార రంగాల్లో 309 మందికి, వ్యవసాయ రంగంలో నలుగురికి రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈనెల 14 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వయో పరిమితి 21 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ రంగానికి దరఖాస్తు చేసుకునే వారికి డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి తప్పక ఉండాలన్నారు. ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో వెబ్‌సైట్‌లో వివరాల నమోదు తర్వాత ఎంపిడిఒ, మున్సిపల్ కమిషనర్లను సంప్రదించాలని సూచించారు.