24న రాష్ట్రస్థాయి విద్యా సదస్సు

ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, యుటిఎఫ్‌ వ్యవస్థాపక

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌

ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు, యుటిఎఫ్‌ వ్యవస్థాపక స్థాపక ప్రధాన కార్యదర్శి అప్పారి వెంకటస్వామి స్మారక రాష్ట్రస్థాయి విద్యా సదస్సు శ్రీకాకుళంలో ఈ నెల 24న నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని యుటిఎప్‌ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎల్‌.బాబూరావు అధ్యక్షతన ఆఫీసు బేరర్స్‌ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకపక్ష నిర్ణయాలు, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలుగుజాతి ఐక్యతకు చిహ్నంగా యుటిఎఫ్‌ స్థాపనలో క్రియాశీలకంగా పనిచేసిన ఆదర్శ జీవి ఎవిఎస్‌ అని కొనియాడారు. నాటి రోజుల్లో ఉద్యోగులకు సంఘం పెట్టుకొనే హక్కు లేదని, ప్రభుత్వ నిర్బంధాలను ఎదిరించి రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మలచడంలో కీలక భూమిక పోషించారని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు విద్య ప్రయివేటీకరణ వైపు వెళ్లే విధానాలు, సంస్కరణలు ప్రవేశపెడుతున్నాయని విమర్శించారు. దేశ, రాష్ట్ర అవసరాలకు అనువైన విద్యను కాదని, ప్రపంచ అవసరాలు తగ్గట్టుగా సంస్కరణలు ప్రవేశ పెట్టడం దేశానికి నష్టదాయక మన్నారు. ఆర్థిక రంగంలో అభివృద్ధి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తున్నారన్నారు. దీనివల్ల ఉత్పత్తిలో భాగస్వామ్యంగా ఉన్న ప్రజలకు సంపద అందకుండా పోతోందని, దీనివల్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.కిషోర్‌కుమార్‌ మాట్లాడుతూ విద్య ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల కోట్లకు పైగా చెల్లించాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వాటిని చెల్లించకపోవడం దారుణమన్నారు. 12వ పిఆర్‌సి కమిటీ వేసి 30 శాతం ఐఆర్‌ వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ యుటిఎఫ్‌ చేపట్టిన ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ని విస్తృతంగా ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యుటిఎఫ్‌ సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, దాలయ్య, రవికుమార్‌, హనుమంతు అన్నాజీరావు, సూర్యప్రకాష్‌, శారద, స్వర్ణకుమారి, రమణ, మురళీధర్‌, గౌరీశ్వరావు, శంకరరావు, శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.

➡️