ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఆర్‌టిసి ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో శ్రీకాకుళం 1, 2 డిపోలకు 25 కొత్త బస్సులను ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ బస్సుల రాకతో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందన్నారు. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌లో కొత్త బస్సులను జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కొత్తగా మరో 42 బస్సులు రానున్నాయని తెలిపారు. ఇంద్ర ఎసి బస్సుతో పాటు ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు సర్వీసులు ఇందులో ఉన్నాయన్నారు. త్వరలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మహిళల ప్రయాణానికి ఇబ్బందుల్లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు. గత ప్రభుత్వం బస్సు కొనుగోలు చేయలేదని, మరమ్మతులకు గురైన బస్సులతో సర్వీసులు నడిపి ప్రయాణికులను అవస్థలకు గురిచేసిందని విమర్శించారు. రానున్న కాలంలో ఆర్‌టిసిని బలోపేతం చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాధికారి విజరు కుమార్, డిపో మేనేజర్లు శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.