అందరి ఆమోదంతోనే కార్గో ఎయిర్‌పోర్టు

స్థానిక రైతుల

మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష

  • ఎమ్మెల్యే గౌతు శిరీష

ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు

స్థానిక రైతుల అనుమతి, ఆమోదం లేకుండా కార్గో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ఒక్క అడుగూ ముందుకు వేయబోమని ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మండల పరిషత్‌ బడ్జెట్‌, సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఎంపిపి ఉప్పరపల్లి నీలవేణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. 2025-26 అంచనా బడ్జెట్‌ రూ.13,71,83,200 ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. కార్గో ఎయిర్‌పోర్టుపై రైతులకు సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారనిమండల విప్‌ తిర్రి గుణ ప్రశ్నించగా, దీనిపై వాడివేడి చర్చ సాగింది. పరిశ్రమలు, ఎయిర్‌పోర్టు వస్తే ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరుగుతాయని, స్థానికులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఎమ్మెల్యే శిరీష అన్నారు. దీన్ని సహించలేకే ఉద్యమాలు అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పు చేసి, వాటిని రైతులు, ప్రతిపక్షాలపై నెడితే సహించేది లేదని మండల ప్రత్యేక ఆహ్వానిడుతుడు ఉప్పరపల్లి ఉదరు కుమార్‌ అన్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో రైతులకు పరిహారం విషయంలో అన్యాయం జరగకూడదన్నారు. భూముల సర్వే సమయంలో రైతులకు తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. భూముల సర్వే కేవలం ఎయిర్‌పోర్టు ఫీజుబిలిటీ కోసమేనని, అందుకే స్కెచ్‌ ఇచ్చామని, ఇంకా ఫైనల్‌ కాలేదని తహశీల్దార్‌ చెప్పడంతో చర్చ ముగిసింది. ప్రోటోకాల్‌ను అధికారులు ఉల్లంఘిస్తున్నారని ఎంపిపితో పాటు పలువురు సభ్యులు ఎమ్మెల్యేను నిలదీయడంతో గందరగోళం నెలకొంది. అందుకే తాము ఉపాధి హామీ పనులకు సంబంధించిన సంతకాలు చేయలేదని ఉదరు కుమార్‌, ఇతర సభ్యులు చెప్పారు. వజ్రపుకొత్తూరు మండలంలో సర్పంచ్‌లు సహకరించకపోవడంతో ఉపాధి హామీ సిసి రోడ్ల నిర్మాణంలో వెనుకబడ్డామని ఎమ్మెల్యే శిరీష అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పలాస, మందస మండలాల్లో లేదన్నారు. అభివృద్ధికి సహకరించాలని, పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలని కోరారు. వజ్రపుకొత్తూరు మండలంలోని 11 తీర ప్రాంత పంచాయతీల్లో ఇసుక నేలల్లో పనులు చేపట్టేదుకు అనుమతులు ఉన్నాయని, పనులు చేపట్టాలని ఉపాధి హామీ అధికారులను ఆదేశించారు. దేవునల్తాడలో రూ.రెండు కోట్లతో సీ కేజ్‌ కల్చర్‌, ఆధునాతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఎఫ్‌ఎఓ ధర్మరాజు పాత్రో తెలిపారు. సమావేశంలో జెడ్‌పి వైస్‌ చైర్‌పర్సన్‌ పి.శ్రావణి, వైస్‌ ఎంపిపిలు వంక రాజు, తమ్మినేని శ్రావణి, ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌ నాయుడు, ఎంపిటిసి సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

➡️