జిల్లా అభివృద్ధికి ఏవిధంగా దోహదపడని శాఖ

ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు

రామ్మోహన్‌నాయుడుకు పౌర విమానయానశాఖ

  • కేటాయింపువెనుకబడిన ప్రాంతంపై బిజెపి చిన్నచూపు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఎంపీ రామ్మోహన్‌ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో టిడిపి శ్రేణులతో పాటు జిల్లా ప్రజానీకమూ ఎంతో సంబరపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్‌ హోదా దక్కడంతో ఏదైనా ప్రాధాన్యమున్న మంత్రిత్వశాఖ కేటాయిస్తారని అంతా ఆశగా ఎదురుచూశారు. వారి ఆశలను అడియాశలను చేస్తూ మోడీ ప్రభుత్వం పౌర విమానయాన శాఖను కట్టబెట్టింది. సంపన్నులకే పరిమితమైన విమానయాన శాఖ ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. విమానయానశాఖ ద్వారా పెద్దగా నిధులు వచ్చే పరిస్థితే లేనప్పుడు జిల్లాకు, రాష్ట్రానికి ఏం ఉపయోగమని పలువురు ప్రశ్నిస్తున్నారు. తొలి నుంచీ ఈ ప్రాంతంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న బిజెపి, ప్రస్తుతం అదే ఒరవడి కొనసాగిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విభజన హామీల్లో భాగంగా వెనుకబడిన జిల్లాగా ఉన్న శ్రీకాకుళానికి ఏడాదికి రూ.ఐదు కోట్లు చొప్పున ఇవ్వాల్సిన బిజెపి ప్రభుత్వం, ఆ నిధులను 2018 నుంచి నిలిపిసేంది. పదేళ్లు పూర్తయినా విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయకుండా మోసం చేసింది.ఉత్తరాంధ్ర ప్రాంతమంటే అంత చులకనా?ఉత్తరాంధ్ర ప్రాంతమంటే బిజెపికి తొలి నుంచీ చులకనభావం ప్రదర్శిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎన్‌డిఎ మొదటి పర్యాయం పాలనలో విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు పౌర విమానయన శాఖ మంత్రిత్వశాఖ కేటాయించింది. ఇప్పుడు ఎన్‌డిఎ మూడో పర్యాయం పాలనలోనూ అదే శాఖను ఎంపీ రామ్మోహన్‌నాయుడుకి కేటాయించింది. నరసాపురం నుంచి బిజెపి తరుపున ఎన్నికైన ఎంపీ శ్రీనివాసవర్మకు సహాయ మంత్రిగా భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేటాయించింది. ఆ శాఖ కేటాయించినా వెనుకబడిన ప్రాంతమైన జిల్లాలో ఒకట్రెండు భారీ పరిశ్రమలైనా ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కేది.నాటి యునైటెడ్‌ ఫ్రంటే నయంప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం కంటే నాటి యునైటెడ్‌ ఫ్రంటే నయంగా కనిపిస్తోంది. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో చేరిన టిడిపికి ప్రాధాన్యం దక్కింది. నేడు అదీ లేదు. నాడు ఎంపీగా గెలిచిన కీర్తిశేషులు కింజరాపు ఎర్రన్నాయుడుకి కీలకమైన కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ కేటాయించింది. ప్రస్తుత ఎన్‌డిఎ సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపి తర్వాత రెండో అతి పెద్దగా పార్టీగా టిడిపి ఉన్నా, ప్రభుత్వ శాఖల కేటాయింపులో ఆ మేరకు ప్రాధాన్యం లేకపోవడంపై ఆ పార్టీ నాయకుల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️