అందరికీ ‘ఆవాసం’

ఇళ్లు లేని పేదలందరికీ గృహాలు

సర్వే చేయిస్తున్న సిబ్బంది (ఫైల్‌)

పిఎంఎవై అర్బన్‌ 2.0 కింద పేదలకు ఇళ్లు

గ్రామాల్లో సర్వే చేస్తున్న గృహ నిర్మాణ సిబ్బంది

ఇప్పటివరకు 22,632 మంది లబ్ధిదారుల గుర్తింపు

ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల సాయం

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ఇళ్లు లేని పేదలందరికీ గృహాలు నిర్మించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ (పిఎంఎవై-యు) పథకాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయం తరగతి (ఎల్‌ఐజి), ఎక్కువ ఆదాయం తరగతి (ఎంఐజి) కేటగిరీల్లో ఉన్న అర్బన్‌ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. అందుకయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులను వెచ్చించనున్నాయి. ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ఇప్పటికే గృహనిర్మాణ శాఖ అధికారులు, సిబ్బంది సర్వే మొదలుపెట్టారు.పిఎంఎవై అర్బన్‌ 2.0పై రెండు నెలల కిందట సర్వే కోసం గతేడాది అక్టోబరులోనే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది. జిల్లావ్యాప్తంగా శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) పరిధిలోకి రావడంతో ఈ పథకం అన్ని మండలాలకూ వర్తించనుంది. పథకం కింద ఎంపికైన లబ్ధిదారునికి బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ (బిఎల్‌సి) కేటగిరీలో ఇంటి నిర్మాణం కోసం రూ.2.50 లక్షల ఆర్థికసాయం అందించనుంది. అందులో కేంద్రం వాటా రూ.1.50 లక్షలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఇవ్వనుంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మిచుకునేందుకు ముందుకు వచ్చే వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థలాలకు సంబంధించిన పత్రాలను, భార్యాభర్తల ఆధార్‌ కార్డులను, సామాజిక తరగతి ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డు పత్రాలతో పాటు దరఖాస్తు చేసుకోవాలి. గతంలో తమ పేర్లతో ఎటువంటి గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరు కాని వారికి మాత్రమే మంజూరు చేస్తారు. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత వాటిని తమ పరిధిలోని గృహనిర్మాణ శాఖ ఎఇకి అందించాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పిఎం స్వనిధి, పిఎం విశ్వకర్మ, సఫాయి కర్మచారి, అంగన్‌వాడీ వర్కర్స్‌, భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర గుర్తించిన తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. దరఖాస్తుల వివరాల నమోదుకు యునిఫైడ్‌ వెబ్‌ పోర్టల్‌నూ ప్రారంభించింది. లబ్ధిదారులు నేరుగా నూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.అర్బన్‌ ప్రాంతాల్లో 818 మంది గుర్తింపుజిల్లాలో నాలుగు అర్బన్‌ ప్రాంతాల్లో కలిపి మొత్తం 818 మందికి గృహాలు లేనట్లు సర్వేలో గుర్తించారు. శ్రీకాకుళం అర్బన్‌లో 120 మంది తమకు ఇళ్లు కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమదాలవలస అర్బన్‌లో 337 మందికి ఇళ్లు లేనట్లు తేలింది. ఇచ్ఛాపురంలో 134 మందికి, పలాస-కాశీబుగ్గలో 227 మందికి ఇళ్లు లేనట్లు గుర్తించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సర్వే కొనసాగనుంది. సర్వే పూర్తయిన తర్వాత ఏప్రిల్‌లో ఇళ్లను కేటాయించనుంది.22,632 మంది లబ్ధిదారుల గుర్తింపుపిఎంఎవై అర్బన్‌ 2.0 పథకం కోసం గతేడాది అక్టోబరులో సర్వే చేపట్టారు. గ్రామాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులు, పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులు పర్యవేక్షించారు. గృహ నిర్మాణశాఖ, సచివాలయ సిబ్బంది సర్వే నిర్వహించారు. సర్వేలో ఇప్పటివరకు 22,632 మందిని ఇళ్లు లేని పేదలుగా గుర్తించారు. ఇందులో 21,814 గ్రామీణ ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు, 818 మంది పట్టణ పరిధిలోని పేదలు ఉన్నారు. రణస్థలం మండలంలో అత్యధికంగా 1249 మంది గ్రామీణ పేదలకు ఇళ్లు లేనట్లు సర్వేలో గుర్తించారు. జలుమూరు మండలంలో 1220 మందికి, పోలాకిలో 1202 మంది ఇళ్లు లేని పేదలు ఉన్నట్లు గుర్తించారు. గార మండలంలో 1131 మంది, కవిటిలో 1110 మంది, కంచిలిలో 1101 మంది గ్రామీణ పేదలకు ఇళ్లు లేనట్లు గుర్తించారు. ఎచ్చెర్లలో 1082 మందికి, సారవకోట లో 1075 మందికి, నరసన్నపేటలో 1050 మందికి ఇళ్లు అవసరమైనట్లుగా సర్వేలో గుర్తించా రు. మందసలో అత్యల్పంగా 144 మంది మాత్రమే ఇళ్లు కోరుకున్నట్లుగా తెలుస్తోంది. టెక్కలిలో 268 మందికి, కోటబొమ్మాళిలో 322 మందికి, ఎల్‌ఎన్‌పేటలో 354 మందికి, హిరమండలంలో 435 మందికి ఇళ్లు లేనట్లుగా సర్వేలో వచ్చింది.

 

➡️