ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు
- సిఐటియు డిమాండ్
- కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి – శ్రీకాకుళం
కాంట్రాక్టు, ఆప్కాస్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. డిమాండ్స్ డేను పురస్కరించుకుని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, పర్మినెంటేతర కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తదితర డిమాండ్లతో సిఐటియు ఆధ్వర్యాన కార్మికులు ఆర్‌అండ్‌బి కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వడం లేదని, కాంట్రాక్టరు చెల్లించాల్సిన పిఎఫ్ వాటాను కార్మికుల వేతనాల నుంచే మినహాయిస్తున్నారని తెలిపారు. విపరీతంగా పనిభారం పెంచారని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్‌టిసి హైర్ బస్ డ్రైవర్లను డిఎం, డిఎల్‌పి అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఆమదాలవలస, రాగోలు ఎన్.జి రంగా వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న కార్మికులు ఎండనక, వాననక పనిచేస్తున్నా రోజుకు రూ.300కు మించి వేతనం ఇవ్వడం లేదని, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయడం లేదని చెప్పారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎపిబిఎస్‌ఎల్ హమాలీలకు ఎగుమతి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగ, కార్మికులకు రిటైర్మెంట్ వయసు 62 ఏళ్ల వరకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులంటే ఎక్కువ కష్టం చేసి తక్కువ జీతం పొందే వారని, ఎండా, వాన అనక కష్టపడి పనిచేసినా అతి తక్కువ జీతం ఇస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఆప్కాస్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 2008 నుంచి అమలైన మినిమం టైమ్ స్కేల్‌కు తిలోదకాలు ఇస్తూ గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం జిఒ నంబరు 151 విడుదల చేసిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా విద్య, వైద్యం, రవాణా ఖర్చులు భారంగా మారినా వాటికనుగుణంగా వేతనాలు పెంచడం లేదన్నారు. వచ్చే జీతం కనీస అవసరాలు కూడా తీరడం లేదన్నారు. నిజ వేతనాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాంటి పనుల్లో పర్మినెంట్ కార్మికులే ఉండాలని చట్టం చెప్తోందని తెలిపారు. చట్టప్రకారం ఇవ్వాల్సిన బెనిఫిట్లు, హక్కులన్నీ తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లాపరిషత్‌లో నిర్వహించిన ‘మీకోసం’లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఎపిఎస్ ఆర్‌టిసి హైర్ బస్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎస్.రాధాకృష్ణ, అజరు, జి.ఎస్ రావు, రిమ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.రవి, జి.కృష్ణవేణి, ఎ.సావిత్రి, టి.కుమారి, ఎం.దమయంతి, ఎన్.జి రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం వర్కర్స్ యూనియన్ నాయకులు ఎ.యుగంధర్, కె.గణపతి, ఎన్.సీతాలక్ష్మి, ఎమ్.సునీత, తదితరులు పాల్గొన్నారు.