విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమం

ప్రజలపై భారాలు మోపే విద్యుత్‌ ట్రూఅప్‌ ఛార్జీలను రద్దు

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణమూర్తి

ట్రూఅప్‌ ఛార్జీలు, స్మార్ట్‌మీటర్లు రద్దు చేయాలి

వామపక్ష నాయకుల డిమాండ్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రజలపై భారాలు మోపే విద్యుత్‌ ట్రూఅప్‌ ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్‌మీటర్ల బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కష్ణమూర్తి, సిపిఐ (ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి తాండ్ర అరుణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిక్కాల గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘విద్యుత్‌ భారాలను ప్రజలపై వేయొద్దు’ అనే అంశంపై నగరంలోని ఎన్‌జిఒ హోంలో వామపక్షాల ఆధ్వర్యాన శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు, కార్మికులు, ప్రజల పాలిట ఉరితాళ్ళుగా మారనున్న విద్యుత్‌ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు ముందుగా ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్‌ మీటర్లు పెడుతున్నారని, నివాసాలకూ పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం కొనసాగిస్తున్నారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం పంపుసెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన తీవ్రంగా వ్యతిరేకించాయని, వాటిని పగులగొట్టాలని పిలుపునిచ్చాయని గుర్తు చేశారు. అదానీ, షిర్డీసాయి సంస్థలతో కుమ్మక్కై మీటర్లు పెడుతున్నారని ఆరోపించిన వారు ఆ ఒప్పందాలనే కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే రూ.17 వేల కోట్ల ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని ప్రజలు మోస్తున్నారని వివరించారు. స్మార్ట్‌ మీటర్లు బిగిస్తూ ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను వంచిస్తున్నారన్నారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటరు వల్ల ప్రజలు ముందుగా డబ్బులు చెల్లించి రీఛార్జ్‌ చేయించుకోవాలని, బ్యాలెన్స్‌ పూర్తి కాగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారమే మిగులుతుందన్నారు. మరోవైపు ప్రతి మీటర్‌కు అయ్యే వ్యయం 96 నెలల పాటు వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారని చెప్పారు. విద్యుత్‌ అధికంగా వినియోగించే రాత్రివేళల్లో అధిక రేట్లు వసూలు చేయడం వల్ల ప్రజలకు తలకు మించిన భారమవుతుందన్నారు. వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టేందుకే పంపుసెట్లకు మీటర్లు బిగిస్తున్నారని విమర్శించారు. భారం ఉండదని రైతులకు నమ్మబలికి ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు దోచిపెట్టేందుకు ప్రజలపై భారాలు వేస్తున్నారని చెప్పారు. ఉచిత విద్యుత్‌ను దశల వారీగా తొలగించేందుకు స్మార్ట్‌ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపికి నాటి వైసిపి, నేటి టిడిపి కూటమి ప్రభుత్వాలు మోకరిల్లుతున్నాయని విమర్శించారు. సమావేశంలో సిపిఎం నాయకులు కె.నాగమణి, పి.తేజేశ్వరరావు, కె.సూరయ్య, ఎం.గోవర్థనరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️