రైడ్‌కు సిద్ధంగా ఉన్న హెలీకాప్టర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
రథసప్తమి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళంలో మూడు రోజులు పాటు పర్యాటక శాఖ ఆధ్వర్యాన చేపట్టిన హెలీకాప్టర్ రైడ్ జిల్లా ప్రజలకు కొత్త అనుభూతి నిచ్చింది. డచ్ బిల్డింగ్ వద్ద ఏర్పాటు చేసిన హెలీకాప్టర్ ద్వారా ఆకాశంలో విహరిస్తూ అందమైన ప్రదేశాలను తిలకించేందుకు వీలు కల్పించారు. సాధారణంగా హెలీకాప్టర్ రైడ్‌లో ఒక్కో టికెట్ రూ.2000 కాగా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో రూ.1800కే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచడం వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రజల కోరిక మేరకు ఈ రైడ్‌ను ఈనెల ఐదో తేదీ వరకు పొడిగించారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ రైడ్ నిర్వహిస్తున్నారు. హెలీకాప్టర్ రైడింగ్ ప్రారంభమైన తొలిరోజు ఆదివారం 200 మంది హెలీకాప్టర్‌లో విహరించగలిగారు. తద్వారా ఒకే రోజు రూ.3.60 లక్షల ఆదాయం వచ్చింది. సోమవారం 270 మంది హెలీకాప్టర్ ఎక్కగా, 45 రౌండ్లలో రూ.4.86 లక్షల ఆదాయం సమకూరింది. మంగళవారం కూడా ఇదే స్థాయిలో 45 రౌండ్లలో పర్యాటకులను ఆకాశంలో విహరించేందుకు వీలు కల్పించింది. ఒక్కోదపా సరాసరి ఆరుగురు చొప్పున రోజుకు సుమారు 270 మందికి విహరించేందుకు వీలు కలుగుతోందని పర్యవేక్షణాధికారి, డ్వామా పీడీ సుధాకరరావు తెలిపారు.