జనాభా ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా వర్గీకరణ
సచివాలయాల సర్దుబాటుకు ఉత్తర్వులు జారీ
సాధారణ, ప్రత్యేక విధులు నిర్వహించే ఉద్యోగులుగా విభజన
రేషనలైజేషన్‌పై త్వరలో మార్గదర్శకాలు
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం భావించింది. సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తూ ఈనెల పదో తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. జనాభాకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు వీలుగా రియల్ టైమ్ పౌర సేవలను అందించేందుకు సిబ్బందికి విధులు కేటాయించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది, కేటగిరీల వారీగా కూర్పు తదితర అంశాలపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.జిల్లాలో 732 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 657, అర్బన్ ప్రాంతాల్లో 75 సచివాలయాలు ఉన్నాయి. వీటిని 380 క్లస్టర్లుగా విభజించారు. వీటిలో మొత్తం 6,075 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల నమూనా మారనుంది. జనాభా 2,500 లోపు ఉంటే ఎ-కేటగిరి, 2501 నుంచి 3,500 మంది ఉంటే బి-కేటగిరిగా విభజించారు. 3,501 మంది పైన ఉంటే సి-కేటగిరిగా నిర్ణయించారు. జిల్లాలో ఎ-కేటగిరి పరిధిలో 207, బి-కేటగిరి కింద 282, సి-కేటగిరి కింద 243 సచివాలయాలు తేలాయి. ఎ-కేటగిరిలో ఆరుగురు ఉద్యోగులే ఉంటారు. వీరిలో ఇద్దరు సాధారణ అవసరాల విధుల కోసం, ప్రత్యేక అవసరాల విధుల కోసం నలుగురు ఉంటారు. బి-కేటగిరిలో ఏడుగురు ఉద్యోగులు ఉంటారు. వీరిలో సాధారణ విధుల కోసం ముగ్గురు, ప్రత్యేక విధుల కోసం నలుగురు ఉంటారు. సి-కేటగిరిలో ఎనిమిది మంది ఉంటారు. వీరిలో సాధారణ, ప్రత్యేక విధుల కోసం నలుగురేసి చొప్పున ఉంటారు.సాధారణ, ప్రత్యేక విధుల కోసం ఉద్యోగుల విభజనగ్రామ సచివాలయాల్లో సాధారణ విధుల కోసం పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉంటారు. వార్డు సచివాలయంలో వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, మహిళా పోలీసు ఉంటారు. గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక విధుల కోసం గ్రామ రెవెన్యూ అధికారి, ఎఎన్‌ఎం, సర్వే, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్ గానీ ఉద్యాన గానీ పట్టుపురుగుల పెంపకం అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ కార్యదర్శి, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ, ఎమినిటీస్ సెక్రటరీ, వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ ఉంటారు.ఎ-కేటగిరిలో ఎవరుంటారు..?ఎ-కేటగిరి పరిధిలోకి వచ్చే గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గానీ డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గానీ మహిళా పోలీసు ఉంటారు. వార్డు సచివాలయంలో వార్డు అడిన్మిస్ట్రేటివ్ కార్యదర్శి, లేదా వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రోసెసింగ్ సెక్రటరీతో పాటు వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసు ఉంటారు. బి-కేటగిరి గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసు ఉంటారు. వార్డు సచివాలయంలో వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ లేదా మహిళా పోలీసు ఉంటారు. సి-కేటగిరి పరిధిలోని గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉంటారు. వార్డు సచివాలయంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ, మహిళా పోలీసు ఉంటారు. రేషనలైజేషన్‌పై త్వరలో మార్గదర్శకాలుగ్రామ సచివాలయాల్లో 11 మంది, అర్బన్‌లో పది మంది ఉద్యోగులు పలు కేడర్లలో పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసులను ఉంచనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో అడ్మిన్ కార్యదర్శితో పాటు నలుగురే ఉంటారని తెలుస్తోంది. ఇప్పటివరకు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న పరిపాలన, సంక్షేమం, మహిళా కార్యదర్శి, గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, విద్యా సంక్షేమం, మహిళా సంరక్షణ కార్యదర్శి కేడర్లపై ప్రభావం చూపనుంది. దీంతో ఉద్యోగుల మిగులు సంఖ్య తేలనుంది. వీరిని ప్రభుత్వ శాఖల్లో విలీనం చేస్తారా? లేదా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉద్యోగుల రేషనలైజేషన్ అంశంపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ కానున్నాయని తెలిసింది.