విద్యుత్‌ సమస్య పరిష్కరించాలని వినతి

విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో గత ఐదేళ్లుగా అనేక ఇబ్బందులు

వినతిపత్రం అందిస్తున్న కాలనీవాసులు

ప్రజాశక్తి- కవిటి

విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో గత ఐదేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని కంచిలి గ్రామం అబ్దుల్‌ కలామ్‌ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీరాంపురం మాజీ సర్పంచ్‌ మాదిన రామారావు కుమారుడు ప్రదీప్‌తో కలిసి తమకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే అశోక్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో టిడిపి హయాంలో జూనియర్‌ కళాశాల వెనుకవైపు 145 మంది నిరుపేదలకు అబ్దుల్‌ కలామ్‌ కాలనీ పేరుతో ఇళ్ల స్థలాలు మంజురైనట్టు తెలిపారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం తమ కాలనీకి విద్యుత్‌ సౌకర్యం కల్పించడంలో అలసత్వం వహించిందని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.అలాగే కంచిలి మండలం కుంబరినౌగాం పంచాయతీలోని భువనపురం, బుర్రాపడ, రంగోయి, కొనక, సింకులి, సింగుపురం, బాలిగాం, తెంబుర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులు గత 40 ఏళ్లుగా భూములు సాగుచేస్తున్నా వారికి పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వపరంగా ఎటువంటి సౌకర్యాలు పొందలేకపోతున్నా రని, వారికి పట్టాలు మంజూరు చేయాలని సిపిఐ కన్వీనర్‌ ఐ లోకనాథం అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ సభ్యులు హరిచంద్ర, ధను ప్రధాన్‌, కూర ప్రధాన్‌, ధీనబంధు, బొబ్బి, సోమేశ్‌, గణేష్‌ పాల్గొన్నారు.

 

➡️