సమరశీల పోరాటాలే శ్రీరాములుకు నివాళి

సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు

మాట్లాడుతున్న తులసీదాస్‌

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సిపిఎం సీనియర్‌ నాయకులు బమ్మిడి శ్రీరాములు మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్‌ అన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు. శ్రీకాకుళం నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో గురువారం బమ్మిడి శ్రీరాములు సంస్మరణ సభను నిర్వహించారు. శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా తన యావత్‌ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు అని కొనియాడారు. చిన్న వయసులోనే ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేయడం ప్రారంభించారని తెలిపారు. నగరంపల్లి కేంద్రంగా పలాస ప్రాంతంలో ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి, ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేశారని గుర్తుచేశారు. 1968 నుంచి 1975 వరకు అజ్ఞాతంలో ఉన్నారని, పార్వతీపురం కుట్ర కేసులో 1975లో అరెస్టయి రెండేళ్ల పాటు జైల్లో నిర్బంధించబడ్డారని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగా, జిల్లా కమిటీ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం ఉపాధ్యక్షునిగా సుదీర్ఘకాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి మాట్లాడుతూ బమ్మిడి శ్రీరాములు ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన, రైతాంగ, కార్మిక పోరాటాలు చేశారని కొనియాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో సిపిఎం నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, కె.శ్రీనివాసు, వి.జి.కె మూర్తి, ఎస్‌.ప్రసాదరావు, ఎన్‌.షణ్ముఖరావు ఎస్‌.భాస్కరరావు, ఎం.ఆదినారాయణమూర్తి, సిహెచ్‌.అమ్మన్నాయుడు, ఎన్‌.గణపతి, ఎస్‌.లక్ష్మీనారాయణ, బొడ్డేపల్లి మోహనరావు, కొల్లి ఎల్లయ్య, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

➡️