పోర్టు పనులు వేగవంతం

మూలపేట పోర్టు పనులు

సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ 

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

* నిర్వాసితుల నష్టపరిహారంపై ఆరా

ప్రజాశక్తి – నౌపడ

మూలపేట పోర్టు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టును బుధవారం పరిశీలించిన అనంతరం పోర్టు సమావేశ మందిరంలో పోర్టు అధికారులు, విశ్వసముద్ర కంపెనీ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోర్టులో చేపడుతున్న నార్త్‌, సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు, అప్రోచ్‌ రోడ్డు, ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోర్టు కోసం ఎంతమేర ప్రభుత్వ, జిరాయతీ భూములు సేకరించారు, ఎంతమంది రైతులకు నష్టపరిహారం చెల్లించారు, భూములు ఇవ్వని రైతుల డిమాండ్లు తదితర విషయాలపై ఆరా తీశారు. భూములు ఇవ్వని రైతులు గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే రెండింతలు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తున్నారని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మొదటి దశలో నిర్మిస్తున్న పోర్టు ముఖచిత్రం, మ్యాపు, కాంక్రీట్‌ వర్క్‌, పైపులైన్‌ వర్క్‌, ఎర్త్‌ లెవలింగ్‌ పనులు తదితర అంశాలను కలెక్టర్‌కు వివరించారు. త్వరలోనే మిగిలిన రైతుల నష్టపరిహారం, పెండింగ్‌లో ఉన్న పిడిఎఫ్‌ ప్యాకేజీలపై రైతులకు స్పష్టత ఇస్తామన్నారు. అనంతరం సముద్రంలో నిర్మిస్తున్న సౌత్‌ బ్రేక్‌ వాటర్‌ పనులను క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నిర్మాణ తీరు, పనుల నాణ్యతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తిరుగు ప్రయాణంలో నౌపడ సమీపంలో పునరావాస కాలనీ, ఉప్పు భూములు, ఎపిఐఐసి భూములను పరిశీలించారు. ఆయన వెంట టెక్కలి సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌, సంతబొమ్మాలి తహశీల్దార్‌ జి.సత్యనారాయణ, రెవెన్యూ, సర్వే అధికారులు, పోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

➡️