ధాన్యం కొనుగోలు వేగవంతం

రైతులకు మద్దతు ధరను అందించేందుకే

రికార్డులను పరిశీలిస్తున్న జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

ప్రజాశక్తి – ఆమదాలవలస

రైతులకు మద్దతు ధరను అందించేందుకే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ తెలిపారు. మండలంలోని శ్రీనివాసాచార్యులపేట రైతు సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సేకరణకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేపట్టి మద్దతు ధర దక్కేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు వెళ్లే ట్రక్‌ షీట్లను సకాలంలో పూర్తి చేసి అందించాలని సూచించారు. తేమ శాతం పేరుతో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి బగాది నాగరాజు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

 

➡️