మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్
ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఆలయ భూములు ఆక్రమణకు గురైతే చట్టరీత్యా చర్యలు తీసుకొని స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని దేవాదాయశాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. జిల్లాలోని అనేక పురాతన ఆలయాలకు వందల ఎకరాల భూములున్నాయని, వాటిని క్రమబద్ధీకరించకపోవడం వల్ల పలుచోట్ల ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. అరసవల్లి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమల్లో ఉందని, ప్రసాదం స్కీమ్ ద్వారా అభివృద్ధి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందన్నారు. అందుకోసం కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు తన వంతు కృషి చేస్తున్నారన్నారు. అరసవల్లిలో ఏటా నిర్వహించే రథసప్తమి వేడుకలకు ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రథసప్తమి వేడుకలను ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందన్నారు. శ్రీకూర్మంలోని శ్వేత పుష్కరిణి, అరసవల్లిలోని ఇంద్ర పుష్కరిణి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో అరసవల్లి ఆలయ ఇఒ, దేవాదాయశాక డిప్యూటీ కమిషనర్ వై.భద్రాజీ, దేవాదాయ శాఖ ఎసి ప్రసాదరావు, శ్రీకూర్మం ఆలయ ఇఒ జి.గురునాథరావు, ఇతర ఆలయాల కార్యనిర్వహక అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.