లక్కివలసలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
మత్స్యకారులకు వలలు, తెప్పలు అందిస్తాం
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి- సంతబొమ్మాళి
గ్రామాల్లో టిడిపి కార్యకర్తలు, ఎంతటి వారైనా వేలం పాట వేసి బెల్ట్ షాపులు నిర్వహించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. డిపిఎన్ రోడ్డు నుంచి మేఘవరం, బోరుభద్ర, పాతమేఘవరం మీదుగా ఎం.సున్నాపిల్లి వరకు మరమ్మతుల కింద రూ.70 లక్షల నిధులతో 15 కిలోమీటర్లు వరకు రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం అమ్మకాలు ఆన్‌లైన్‌లోనే విక్రయించాలన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో మత్స్యకారులకు ఒక్క పథకమూ అందించలేదన్నారు. గత టిడిపి ప్రభుత్వం వలే మరలా కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వలలు, తెప్పలు అందిస్తామని స్పష్టం చేశారు. రూ.64 కోట్లతో ఉపాధి హామీ నిధుల ద్వారా టెక్కలి నియోజకవర్గంలో సిసి రోడ్లు నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామన్నారు. పింఛను పంపిణీమండలంలోని లక్కివలసలో ఎన్‌టిఆర్ భరోసా పింఛను అందజేశారు. అక్కడా మాట్లాడుతూ రెండు నెలలు పింఛను తీసుకపోయినా పింఛను అందజేస్తా మని అన్నారు. గత ప్రభుత్వంలో దొంగ ధ్రువపత్రాల తో పింఛను పొందుతున్న వారిని గుర్తించి రద్దు చేస్తామని అన్నారు. అలాగే వచ్చే నెల నుంచి కొత్త పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే, వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి మంజూరు చేస్తామన్నారు. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు పనులపై సమీక్షమూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరగా తన పూర్తిచేయాలని మంత్రి అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్‌డిఒ కృష్నమూర్తితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూమితో పాటు, రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా నివేదిక రూపంలో తయారు చేసి అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రావెల్, ఇసుక వంటివి అవసరమని మంత్రికి వివరించారు. వంశధార కాలువను త్వరలో ఆధునికీకరించి హిరమండలం నుంచి మేఘవరం వరకు గంటలో నీరు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల పాటు ప్రజలు ఇబ్బందులు గమనించి ఉచిత ఇసుక అందించిన ఘనత సిఎం చంద్రబాబుకే చెల్లిందన్నారు. బోరుభద్ర పిహెచ్‌సి సందర్శనమండలంలోని బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. డాక్టర్ దేవీవనిత సక్రమంగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు మంత్రికి తీసుకొచ్చారు. బోరుభద్ర ఆరోగ్య కేంద్రంలో జీతం తీసుకుంటూ వేరే దగ్గర పనిచేస్తున్న హెల్త్ ఎడ్యుకేటర్ జ్ఞానేశ్వరిని రప్పించాలని స్థానికులు మంత్రికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి ఆమె ఇక్కడే పనిచేలా చూడాలని పక్కనే ఉన్న కలెక్టర్‌కు ఆదేశించారు. అనంతరం బోరుభద్ర కూడలిలో టెక్కలి డిపోకు చెందిన 8 ఆర్‌టిసి ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్, ఎంపిడిఒ జయంతిప్రసాద్, టిడిపి నాయకులు కింజరాపు హరిప్రసాద్, జీరు భీమారావు, చిదపాన ధర్మార్జునరెడ్డి, అట్టాడ రాంప్రసాద్, మోడి రామచంద్రరావు, రెడ్డి అప్పన్న, పిట్ట రాజులు, శ్రీరంగం ఎర్రయ్య, శ్రీరంగం రాజులు, పరపటి రాజశేఖర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపిపి సూరాడ భీమారావు పాల్గొన్నారు.