ఇళ్ల నిర్మాణాలకు అదనపు సాయం

స్వర్ణాంధ్ర విజన్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

స్వర్ణాంధ్ర విజన్‌ 2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గృహ నిర్మాణం లక్ష్యంలో భాగంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వం జిఒఆర్‌టి నంబరు 9 విడుదల చేసిందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం ద్వారా మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు ఎస్‌సి, బిసి లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్‌టి లబ్ధిదారులకు రూ.75 వేలు, పివిటిజి లబ్ధిదారులకు రూ.లక్ష అదనంగా అందజేయనున్నట్టు వెల్లడించారు. గతేడాది డిసెంబరు పదో తేదీ నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే ఈ సాయం అందించడానికి వీలుందని స్పష్టం చేశారు. పేదలందరికీ పక్కా గృహాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా అదనపు ఆర్థికసాయం అందజేస్తున్నట్లు తెలిపారు. నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు త్వరితగతిన అందజేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఏడాది మే నెలాఖరుకు 12,685 ఇళ్లను పూర్తి చేయాలని… ఎంపిడిఒలు, గృహనిర్మాణ శాఖ ఎఇలు పర్యవేక్షించాలన్నారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అదనపు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వార్డ్‌ ఎమెనిటీస్‌ సెక్రటరీలు అర్హత కలిగిన ప్రతి ఇంటినీ తనిఖీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇంటి నిర్మాణ దశ ఫొటోను తీసుకుంటారని తెలిపారు. అదనపు సాయంపై విస్తృత ప్రచారం చేపట్టి ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా, లబ్ధిదారులు ప్రయోజనం పొందే విదంగా తోడ్పాటు అందించాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ నగేష్‌ పాల్గొన్నారు.

➡️