మూడు పథకాల్లో 34,393 మందికి లబ్ధి
డిసెంబరు 10 నాటికి నిర్మాణంలో ఉంటే ప్రయోజనం
23 వరకు ఇంటింటా పరిశీలనకు బృందాలు
మే నెలాఖరులోగా 12,685 ఇళ్ల నిర్మాణం పూర్తి
జిల్లా గృహ నిర్మాణశాఖ పీడీ నగేష్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
స్వర్ణాంధ్ర విజన్-2047లో భాగంగా జిల్లాలో 2029 నాటికి అందరికీ గహనిర్మాణం లక్ష్యంలో భాగంగా అసంపూర్తి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయాన్ని అందిస్తోందని జిల్లా గృహ నిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ నగేష్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అందించే అదనపు ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వం జిఒ ఆర్‌టి నంబరు 9ని విడుదల చేసిందని తెలిపారు. ఈ జిఒ ప్రాప్తికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన ఇళ్లను పూర్తి చేసేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి పేదలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఎస్‌సి, బిసి లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్‌టి లబ్ధిదారులకు రూ.75 వేలు, పివిటిజి లబ్ధిదారులకు రూ.లక్ష అదనంగా అందజేయనున్నట్టు వివరించారు. గతేడాది డిసెంబరు 10 నాటికి నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు మాత్రమే ఈ సాయం అందించేందుకు వీలుందని అన్నారు. లబ్ధిదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నారు. ముఖాముఖిలో భాగంగా ‘ప్రజాశక్తి’కి వివరించారు. ఎంత మందికి లబ్ధి చేకూరుతుంది?జిల్లాలో సుమారు 34,693 ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్టు గుర్తించాం. వాటిని బాటం లెవల్, లింటర్ లెవల్, రూప్ లెవల్, శ్లాబ్ వేసిన తర్వాత నిలిచి పోయి ఉన్న ఇళ్లను గుర్తించాం. వాటిని ఇప్పుడు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పేదలకు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ప్రభుత్వం వివిధ పథకాలను అందిస్తోంది. పెరుగుతున్న కుటుంబాలు వారి అవసరాలకు తగ్గట్టు సొంతింటిని నిర్మించుకోవాలన్నది ప్రతిఒక్కరి కల. ఈ కల నెరవ్చేడానికి ప్రభుత్వం వివిధ రూపాల్లో సాయపడుతోంది. ప్రస్తుతం గృహ నిర్మాణశాఖ పరిధిలో కొత్త ఇళ్ల మంజూరు కంటే గతంలో మంజూరైన వాటిని పూర్తి చేసేందుకు పెద్దఎత్తున చర్యలు చేపడుతున్నాం. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ దశల్లో నిర్మాణాలు మొదలు పెట్టి అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం.ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి? జిల్లావ్యాప్తంగా 30 మండలాలు, నాలుగు పట్టణ ప్రాంతాల పరిధిలో 83,308 ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో 8790 ఇళ్లు నిర్మాణం వివిధ కారణాల వల్ల మొదలు కాలేదు. మొదలైన వాటిలో బిబిఎల్ స్థాయిలో 10,710, బిబిఎల్ విత్ ఎక్సపెండేచరు 3056, ఇతర దశల్లో నిర్మాణంలో 21960 ఉన్నాయి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారు 41,848 మంది ఇప్పటికే సొంతింటికల నెరవేర్చుకున్నారు. ఇళ్ల నిర్మాణాలకు జిల్లాలో రూ.846.59 కోట్లు ఖర్చు చేశాం. నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఎన్ని ఇళ్లు అసంపూర్తిగా ఉన్నట్టు గుర్తించారు? జిల్లాలో నాలుగు సామాజిక తరగతుల వారీగా 34,693 ఇళ్లు అసంపూర్తి నిర్మాణంలో ఉన్నాయని గుర్తించాం. గతంలో ప్రభుత్వం అందించిన సాయం సరిపోక పెట్టుబడి లేని వారు వాటిని పూర్తి చేయలేక మధ్యలో విడిచి పెట్టేశారు. వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పట్టణ ప్రాంతంలో పిఎం అవాస్ యోజన, గ్రామీణ ప్రాంతంలో పిఎం ఆవాస్ యోజన, పిఎం జన్‌మన్ పథకాల ద్వారా మంజూరైన ఇళ్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మూడు స్కీమ్‌ల పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తూ అదనపు సాయాన్ని ప్రకటింది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే జిఒ నంబరు 9ను జారీ చేసింది. దీని ప్రాప్తికి లబ్ధిచేకూర్చి ఇళ్లను పూర్తి చేయడం ద్వారా పేదలకు సొంతింటికల నెరవేర్చుకునేలా చర్యలు చేపడుతున్నాం. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలి. ఎంతెంత సాయం అందించనున్నారు? జిల్లావ్యాప్తంగా వివిధ దశల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అదనపు సాయమందిస్తోంది. బిసి, ఎస్‌సి లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్‌టి లబ్ధిదారులకు రూ.75 వేలు, పివిటిజి లబ్ధిదారులకు రూ.లక్ష అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ ప్రయోజనం పొందిన లబ్ధిదారులు సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు వీలవుతుంది. పేదలందకీ పక్కా గృహాలు నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులు చెల్లింపు త్వరితగతిన అందించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 12,685 ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. వివిధ దశల్లో నిలిచి ఉన్న ఇళ్లు పూర్తి చేసుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. క్షేత్ర స్థాయిలో ఎంపిడిఒలు, గృహనిర్మాణ శాఖ ఎఇలు పర్యవేక్షణ ఉంది. ఏప్రిల్ 2025లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అదనపు ఆర్థిక లబ్ధిచేకూరుతుంది. ఈ నెల 23 వరకు క్షేత్ర స్థాయిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, వార్డ్ ఎమెనిటీస్ సెక్రటరీలు అర్హత కలిగిన ప్రతి ఇంటినీ తనిఖీ చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిన ప్రతి లబ్ధిదారునితో వారు మాట్లాడుతున్నాం. ప్రజలు సహకరిస్తే ఈ అవకాశాన్ని శతశాతం ఉపయోగించుకునేందుకు వీలవుతుంది.