ఆదిత్యుని జయంత్యుత్సవంవైభవోపేతం

అరసవల్లి సూర్యనారాయణ

అరసవల్లికి పోటెత్తిన జనం

  • అరసవల్లికి పోటెత్తిన సందర్శకులు
  • సిఫార్సులున్న వారికే శీఘ్ర దర్శనం
  • సామాన్య సందర్శకులు గంటల తరబడి నిరీక్షణ
  • రూ.500, రూ.300 టికెట్లు ఉన్న వారిదీ అదే పరిస్థితి
  • క్యూలైన్‌లో సొమ్మసిల్లిపోయిన ఇద్దరు యాత్రికులు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవోపేతంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమైన క్షీరాభిషేక సేవ మంగళవారం ఉదయం ఏడు గంటల వరకు సాగింది. రథసప్తమి వేడుకలను వీక్షించేందుకు అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తెలంగాణ, ఒడిశా నుంచి వేల సంఖ్యలో యాత్రికులు చేరుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించడం… ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు విస్తృత ప్రచారం చేయడంతో అరసవల్లికి జనం పోటెత్తారు.రథసప్తమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పినా, సాధారణ సందర్శకులకు అవే కష్టాలు పునరావృతమయ్యాయి. వాడాడ, ఖాజీపేట కూడలి నుంచి వచ్చిన సందర్శకులు ఉచిత క్యూలైన్లు, రూ.100 టికెట్ల క్యూలైన్లల్లో బారులు తీరారు. ఉదయం పది గంటల వరకు దర్శనాలు సాఫీగానే సాగాయి. వివిఐపిల తాకిడి పెరిగిన తర్వాత గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవాల్సి వచ్చింది. 80 అడుగుల రోడ్డు నుంచి ఉచిత క్యూలైన్ల వద్దకు చేరుకోవడానికి నానా అవస్థలు పడ్డారు. మిల్లు కూడలి నుంచి ఆర్చి వరకూ నాలుగు చోట్ల పోలీసులు రోప్‌లతో సందర్శకులను కట్టడి చేశారు. ఉచిత దర్శనం కోసం వెళ్లే వారికి టికెట్లు లేకపోవడంతో వారిని ఆపేశారు. దీంతో ఎటువైపు వెళ్లాలో తెలియక యాత్రికులు అయోమయానికి గురయ్యారు. రూ.వంద టికెట్‌ తీసుకుని దర్శనానికి వెళ్లేందుకూ ఇబ్బందులు తప్పలేదు. క్యూలైన్‌లోకి వెళ్లిన తర్వాత మాత్రం వారికి శీఘ్ర దర్శనమైంది. రూ.500, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన వారు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చోవాల్సి వచ్చింది. వివిఐపి క్యూలైన్‌లో ఎప్పటిమాదిరిగానే పోలీసులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది తమ కుటుంబసభ్యులను దగ్గర ఉండి దర్శనాలు చేయించారు. సిఫార్సులతో వచ్చిన వారు తమ కళ్లెదుటే లోపలకు వెళ్లి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చేస్తున్నా, రూ.500 టికెట్లు తీసుకున్న వారు ఇంకా అక్కడే ఉండిపోవడంతో వారు తీవ్ర అసహనానికి లోనయ్యారు. మరోవైపు దాతలను, రూ.500 టికెట్‌ తీసుకున్న సందర్శకులను ఒకే లైన్‌లో పంపించడంతో గంటల తరబడి క్యూలైన్‌లో నిరీక్షించాల్సి వచ్చింది.

సిఫార్సులున్న వారికే శీఘ్ర దర్శనం

రథసప్తమి వేడుకల్లో ఈసారీ సిఫార్సులు ఉన్న వారికి అధికారులు, పోలీసులు రెడ్‌ కార్పెట్‌ వేశారు. అధికారులు లెక్కకు మించి విఐపి పాసులు, వాహనాల పాసులు జారీ చేయడంతో ప్రజాప్రతినిధుల బంధువులు, వారి అనుయాయులకు అడ్డే లేకుండా పోయింది. ప్రోటోకాల్‌ వాహనాలు, పాసు కలిగిన వాహనాలు విపరీతంగా తిరిగాయి. వారికి నేరుగా ఆలయం ఆర్చి వరకు అనుమతించారు. దర్శనాల కోసం పోలీసు వాహనాలు, దిచక్ర వాహనాలకు డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డు చెప్పలేదు.

సందర్శకునిపై చేయి చేసుకున్న ఎస్‌ఐ

ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణ పేరుతో నాలుగు చోట్ల రోప్‌లతో సామాన్య సందర్శకులను కట్టడి చేశారు. ఈ క్రమంలో చాలా చోట్ల పోలీసులకు, యాత్రికులకు వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో అరసవల్లి తోట వద్ద శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్‌ఐ హరికృష్ణ పలువురు సందర్శకులను నెట్టేస్తూ ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు.

క్యూలైన్‌లో సొమ్మసిల్లిన ఇద్దరు యాత్రికులు

ఆదిత్యుని దర్శనం కోసం క్యూలైన్‌లో నిల్చొన్న ఇద్దరు యాత్రికులు సొమ్మసిల్లిపోయారు. పోలీసులు వారికి నీళ్లు అందించారు. అందులో ఒకరికి వైద్య శిబిరం దగ్గరకు తీసుకువెళ్లారు.

బందోబస్తు సరళిని పరిశీలించిన డిఐజి

రథసప్తమి వేడుకలకు బందోబస్తులో ఉన్న పోలీసుల విధులను డిఐజి గోపీనాథ్‌ జట్టి పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. ఉచిత దర్శనానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందుల్లేకుండా వేగంగా దర్శనమయ్యేలా చూడాలని చెప్పారు. సందర్శకుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అరసవల్లి ఆర్చి సమీపంలో ఏర్పాటు చేసిన పోలీసు కంట్రోల్‌రూమ్‌ను సందర్శించి సిసి కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా వాహనాల రాక, సందర్శకుల దర్శనం, పార్కింగ్‌, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ వంటి వివరాలను ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి ద్వారా తెలుసుకున్నారు.

క్యూలైన్లను పరిశీలించిన కలెక్టర్‌, ఎస్‌పి

రూ.500, రూ.300 క్యూలైన్లను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్‌పి మహేశ్వరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ స్వయంగా పరిశీలించి సందర్శకులతో మాట్లాడారు. పోలీసు కంట్రోల్‌రూమ్‌ను సందర్శించి సిసి కెమరాలు, డ్రోన్‌ కెమెరా చిత్రాల ద్వారా సందర్శకుల తాకిడి, ట్రాఫిక్‌ సమస్యలను పరిశీలించారు. దర్శనం అనంతరం బయటకు వచ్చే యాత్రికులతో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడి దర్శనం ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. యాత్రికుల తాకిడిని గుర్తించి జెసి, ఆర్‌డిఒలకు ఆదేశాలు జారీ చేశారు.

ఆదిత్యుని దర్శించుకున్న ప్రముఖులు

ఆదిత్యుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డిఐజి గోపీనాథ్‌ జట్టి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌, జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా, ఎస్‌పి కె.వి మహేశ్వరరెడ్డి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు కృష్ణభాస్కర్‌, ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, కూన రవికుమార్‌, గౌతు శిరీష, ఎన్‌.ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్‌, పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.

➡️