వాయు’గండం’

Nov 28,2024 23:40 #వాయు'గండం'
దక్షిణ బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం

ధాన్యం ఓవులను కళ్లాలకు తరలిస్తున్న రైతులు

జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు

అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి

దక్షిణ బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. గురువారం అర్ధరాత్రి తర్వాత తుపానుగా మరొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో జిల్లావ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది. గురువారం వాతావరణలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. స్వల్పంగా గాలులు వీచాయి. అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి. మరోవైపు చలిగాలు తీవ్రత బాగా పెరిగింది. వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్‌లో అధికారులు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. వాయుగుండ ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. కవిటి మండలంలో 0.5 మి.మీ, పలాసలో 0.25 మి.మీ వర్షపాతం నమోదయింది. వాయుగుండ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయనే అంచనాల నేపథ్యంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో ఫోన్‌ నంబరు 08942-240557 నంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. రైతులు ధాన్యాన్ని జాగ్రత్త పరచుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని సూచించారు. రైతులు ఉరుకులు పరుగులువాతావరణంలో మార్పులు కనిపించడంతో రైతులను కలవరానికి గురి చేసింది. పంటను కాపాడుకోవడానినికి ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల వరి కోతలు పూర్తయ్యాయి. కొన్ని చోట్ల పంట కోసి కుప్పలుగా పోశారు. జిల్లాలో ముమ్మరంగా నూర్పులు జరగు తున్నాయి. వర్షాలు పడతాయన్న వార్తల నేపథ్యంలో పంటను కాపాడుకునే పనిలో అన్నదాతలు నిమగమయ్యారు. పొలాల్లో ఎండబెట్టడం కోసం ఉంచిన ధాన్యాన్ని ఇళ్లకు తరలిస్తున్నారు. సరిగ్గా ఈ దశలో వర్షాలు పడతాయన్న వార్తలతో రైతుల్లో గుబులురేపుతోంది. ఈ దశలో ఏ మాత్రం వర్షం కురిసినా ధాన్యంతో పాటు చేలోని పంటకు నష్టం తప్పదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ధాన్యాన్ని జాగ్రత్త పరుచుకోవాలని అధికారులు సలహాలు ఇస్తున్నా… వారికి ఈ ఏడాది టార్ఫలిన్లు సరఫరా చేయకపోవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

 

➡️