పోలింగ్‌ కేంద్రాల్లో సకల సౌకర్యాలు

పోలింగ్‌ కేంద్రాల వద్ద

పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

  • వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు
  • జిల్లా ఎన్నికల అధికారి మనజీర్‌ జిలానీ సమూన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం

పోలింగ్‌ కేంద్రాల వద్ద వేసవి తీవ్రతను తట్టుకునేలా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. జిల్లాలోని 2,358 పోలింగ్‌ కేంద్రాల్లో సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. ‘ఓటరును వదిలివేయబడకూడదు’ అన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటరుకు ఎటువంటి అసౌకర్యం, అవాంతరాలు లేకుండా ఓటు వేయడానికి వీలుగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అత్యుత్తమ సౌకర్యాలను అందిస్తున్నట్లు వివరించారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సాధారణ ఓటర్లు, సీనియర్‌ సిటిజన్లు, పిడబ్ల్యుడి ఓటర్లు అవసరాలకు తగిన విధంగా ర్యాంపులు, తాగునీరు, టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, బెంచీలు, విద్యుత్‌, మరుగుదొడ్లు, వైద్య బృందాలు తదితర ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. క్యూ లైన్లు, ఓటరు సహాయ బూత్‌లు ఉన్నట్లు తెలిపారు. పిడబ్ల్యుడి ఓటర్లకు వీల్‌చైర్లు, ప్రత్యేక క్యూలైన్లు, రవాణా సౌకర్యం కోసం వాహనాలు, సీనియర్‌ సిటిజన్లు, విజువల్‌, లోకోమోటివ్‌ వైకల్యాలు ఉన్న వ్యక్తులు, బలహీనమైన కదలికతో బాధపడుతున్న ఓటర్లకు సహాయం చేయడానికి ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు, భద్రతకు సిఆర్‌పిఎఫ్‌, ఎస్‌ఎపి, పోలీసులను మోహరించినట్లు వివరించారు.వేసవి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల్లో వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి, ఓటర్ల భద్రత కోసం ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, వికలాంగుల కోసం అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో టెంట్లు, పందిరి, గొడుగులు, కుర్చీలు, ఫ్యాన్లు, మిస్టింగ్‌ ఫ్యాన్లు వంటి కూలింగ్‌ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వైద్య బృందాలు, పారా మెడికల్‌ సిబ్బందితో మొబైల్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. డీహైడ్రేషన నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఓటర్లు తడి తువ్వాళ్లను తీసుకెళ్లాలని సూచించారు. మహిళా ఓటర్లు తమతో పాటు పిల్లలను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావద్దని కోరారు.ఓటర్లందరూ పోలింగ్‌ సమయాల్లో ఎన్నికల సంఘం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్డుతో పాటు సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కుల, మత, ఇతర ప్రలోభాలకు గురికావద్దన్నారు. ఓటు కోసం లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమన్నారు.

➡️