కూటమి మోసపూరిత హామీలు

తెలుగుదేశం పార్టీతో జతకట్టిన కూటమి పార్టీ నాయకులు

మాట్లాడుతున్న కృష్ణదాస్‌

వైసిపి జిల్లా అధ్యక్షులు కృష్ణదాస్‌

ప్రజాశక్తి – ఎచ్చెర్ల

తెలుగుదేశం పార్టీతో జతకట్టిన కూటమి పార్టీ నాయకులు ఎన్నికల్లో అమలు కాని మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని వైసిపి జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ దుయ్యబట్టారు. మండలంలోని తమ్మినాయుడుపేటలో బుధవారం వైసిపి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో టిడిపి రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపించి వైసిపి నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌-సిక్స్‌ హామీలైన మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం, ఆడబిడ్డలకు నెలకు రూ.1500 వంటివి ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కూటమి నాయకుల్లో ఒకరికి ఒకరు పొంతన లేదని, రోజుకో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, స్టీల్‌ ప్లాంట్‌ విషయాల్లో రోజుకో విధంగా పొంతన లేని మాటలు చెబుతున్నారని పేర్కొన్నారు. పార్టీ పటిష్టం కోసం ప్రతి కార్యకర్తా ప్రజల వద్దకు వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించాలన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మెప్పుకోసం ఎపి ప్రభుత్వం కూటమి భజన చేస్తుందని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధికారులు అవలంబిస్తున్న తీరుచాలా బాధిస్తుందన్నారు. పరిపాలన అనేది ఏ పార్టీకి శాశ్వతం కాదని, ఈ విషయాన్ని ప్రతి ఉద్యోగీ గుర్తెరగాలని సూచించారు. ఏదేమైనా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశం నియోజకవర్గ వైసిపి నాయకులు సనపల నారాయణరావు, మాజీ ఎంపిపి బల్లాడ జనార్థనరెడ్డి, హేమమాలినిరెడ్డి, జరుగుల్ల శంకరరావు, పంచాది వెంకట నరసింహమూర్తి, ఎండ రమేష్‌, వావిలపల్లి రామారావు, గురుగుబెల్లి రామచంద్రరావు, గురుగుబెల్లి దివాకరరావు, ముద్దాడ రామకృష్ణ పాల్గొన్నారు.

➡️