మాట్లాడుతున్న ఆర్‌డిఒ కృష్ణమూర్తి
క్లస్టర్ వారీగా 80 మంది లాటరీ ద్వారా ఎంపిక
ప్రజాశక్తి – నౌపడ
సంతబొమ్మాళి మండలంలోని మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా నిర్వాసిత గ్రామస్తులకు ప్రభుత్వం ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టింది. టెక్కలి ఆర్‌డిఒ కృష్ణమూర్తి ఆధ్వర్యాన నౌపడలోని ఆర్ అండ్ ఆర్ కాలనీలో విష్ణుచక్రం గ్రామ పెద్దలు, నిర్వాసితుల సమక్షంలో లాటరీ తీసి వారి ప్లాట్ల నంబరు ప్రకారం స్థలాన్ని ప్రకటించారు. నౌపడలో నిర్మిస్తున్న ఆర్ అండ్ ఆర్ కాలనీలో బిసి, ఎస్‌సి క్లస్టర్ వారీగా 28 క్లస్టర్లతో ప్లాట్లను డిజైన్ చేశారు. అందులోని ఒక క్లస్టర్‌లో లాటరీ పద్ధతిలో 80 మంది నిర్వాసితులకు ఫ్లాట్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఫ్లాట్లను కేటాయించామన్నారు. ఆరు నెలల్లో ప్రస్తుతం నివాసం ఉంటున్న గ్రామాన్ని ఖాళీ చేసి కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని నిర్వాసితులను కోరారు. ప్రభుత్వం నిర్వాసితులు కోరుకున్నట్లుగానే నౌపడలో రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపడుతుందని చెప్పారు. ఇందులో భాగంగా సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, డ్రైనేజీలు, ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు, ఆటస్థలం, పాఠశాలలు, ఆలయాలతో పాటు గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.మొదటి విడతలో 80 మంది ఎంపికమూలపేట నిర్వాసిత గ్రామాలైన మూలపేట, విష్ణుచక్రలో మొత్తం 598 మంది నిర్వాసిత కుటుంబాలకు పిడిఎఫ్‌లుగా గుర్తించారు. వీరి కోసం నౌపడ నిర్వాసిత కాలనీ నిర్మించి బిసి, ఎస్‌సిల వారీగా 28 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా విష్ణుచక్రం గ్రామంలోని 80 మంది నిర్వాసితులకు ఫ్లాట్లను పంపిణీ చేశారు. లాటరీ ద్వారా ఎంపికైన నంబర్ల ప్రకారం త్వరలోనే వీరికి ఐదు సెంట్లు చొప్పున స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నారు. పత్రాలు అందుకున్న ఆరు నెలల్లోనే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనిపై నిర్వాసితులు ఇళ్ల నిర్మాణానికి సమయం పొడిగించాలని కోరారు. పోర్టు నిర్మాణంలో కీలక విభాగానికి ప్రస్తుతం ఉన్న విష్ణుచక్రంలోనే నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండడంతో త్వరితగతిన గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు చెప్పారు. మరోవైపు మూలపేట గ్రామంలో 510 పిడిఎఫ్ కుటుంబాలకు ఫ్లాట్ల కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుతానికి విష్ణు చక్రం గ్రామస్తులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్‌డిఒ తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ డిఇ రామకృష్ణ, పంచాయతీరాజ్ డిఇ సుధాకర్, తహశీల్దార్ అప్పలరాజు, ఎంపిడిఒ జయంతి ప్రసాద్, రెవెన్యూ, సర్వే అధికారులు, నౌపడ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.