వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- ‘మీకోసం’లో బేవరేజెస్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వినతి
- అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు : కలెక్టర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
ప్రభుత్వం తీసుకొచ్చిన రిటైల్ మద్యం విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోతున్నామని, అందుకు ప్రత్యామ్నాయంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కె.ధర్మారావు, ప్రధాన కార్యదర్శి శ్రీను డిమాండ్ చేశారు. జిల్లాపరిషత్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వ్యవస్థ (మీకోసం)లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఇతర అధికారులతో కలిసి సోమవారం స్వీకరించిన వినతుల కార్యక్రమంలో వారు వినతిపత్రం అందించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లుగా అవుట్‌సోర్సింగ్ పద్ధతిపై పనిచేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంతో తామంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తమను ఉద్యోగాల నుంచి తీసేస్తే కుటుంబాలను ఎలా పోషించుకుంటామని ప్రశ్నించారు. గతంలో ఎక్సెజ్‌శాఖ ఇచ్చిన ఉద్యోగ నియామక జిఒ ప్రకారం తమకు పలు ప్రభుత్వ శాఖల్లో విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని వారు కోరారు.రేషన్‌కార్డుల సర్దుబాటుతో నష్టంరేషన్ డిపోల్లో కార్డుల సర్దుబాటుతో తాము నష్టపోతామని జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్డులను విడదీసి కొత్త డిపోలు సృష్టించడం వల్ల తమకు కమీషన్ల ద్వారా వచ్చే ఆదాయం తగ్గి నిర్వహణ కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వినతిపత్రం అందించిన వారిలో డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్, బి.రవికుమార్, షణ్ముఖరావు, చిట్టి రమణ తదితరులున్నారు.రస్తా భూమిని ఆక్రమించుకుంటున్నారు పొందూరులోని పార్వతీనగర్‌కాలనీ పరిధిలోని 122, 123 సర్వే నంబర్లలోని రస్తా భూములను ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు, రైతులు, స్థానికులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. చాలా ఏళ్లుగా ఆ మార్గంలో తాము రాకపోకలు సాగిస్తున్నామని, అదే మార్గాన్ని శ్మశానవాటికకు వెళ్లేందుకూ వినియోగిస్తున్నామని వివరించారు. రెవెన్యూ ఎస్‌ఎల్‌ఆర్, 22ఎలో కూడా ఆ ప్రాంతం రస్తాగానే పేర్కొన్నారని చెప్పారు. రస్తా మార్గంపై విచారణ చేసి స్థానికుల అవసరాలకు వినియోగించాలని, అక్కడ రోడ్డు వేయాలని కోరారు.కమ్యూనిటీ స్థలాన్ని పశువుల శాలగా వాడుకుంటున్నారుహిరమండలం తహశీల్దార్ కార్యాలయం దగ్గర కమ్యూనిటీ హాల్‌కు కేటాయించిన స్థలాన్ని పంతుల సింహాచలం ఆక్రమించుకున్నారని గ్రామానికి చెందిన వై.ప్రసాదరావు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని ఆక్రమించుకుని పశువుల శాలగా వాడుతున్నారని చెప్పారు. స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ నిధులతో కమ్యూనిటీహాల్ నిర్మించాలని కోరారు. తనకున్న 98 సెంట్ల భూమిలో నీలగిరి సాగు చేస్తున్నానని, పట్టాదారు పాసుపుస్తకం, 1బి అడంగల్ ఇప్పించాలంటూ గార మండలం రామచంద్రపురానికి చెందిన ఇనపుకుర్తి సూర్యనారయణ వినతిపత్రం అందించారు. ‘మీకోసం’కు 168 అర్జీలు’మీకోసం’కు పలురకాల సమస్యలపై మొత్తం 168 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల నుంచి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇచ్చే వినతులను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి పరిష్కారం చూపాలన్నారు. కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ అప్పారావు, జెడ్‌పి సిఇఒ ఆర్.వెంకట్రామన్ వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.