అంబేద్కర్‌ జీవితం నేటి తరానికి స్ఫూర్తి

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవితాన్ని ప్రతిఒక్కరూ

అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న డిఆర్‌ఒ తదితరులు

జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌, ఎచ్చెర్ల, రణస్థలం

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ జీవితాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. యువత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎం.గణపతిరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్‌ రెడ్డి, జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, కలెక్టరెట్‌ ఎఒ కె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్‌ కూడలి వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి ఎస్‌పి జి.ఆర్‌ రాధిక పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేశారన్నారు. అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. అంబేద్కర్‌ అడుగుజాడల్లో ముందుకు సాగడమే ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని అన్నారు.రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బిజెపి దాని మిత్రపక్షాలను ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు పిలుపునిచ్చారు. ఎచ్చెర్ల కాలనీ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావుతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎపిబిసిఎల్‌ హమాలీస్‌ యూనియన్‌ నాయకులు టి.రామారావు, ఎన్‌.రమణ, బి.రాము తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్‌ కృషి అనిర్వచనీయంనవభారత నిర్మాణం కోసం, ప్రజాస్వామ్యం కోసం, సామాజిక రుగ్మతలు లేని దేశం కోసం అంబేద్కర్‌ చేసిన కృషి అనిర్వచనీయమని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.అమ్మన్నాయుడు అన్నారు. రణస్థలంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే దుర్భరమైన వివక్షను, అవమానాలను ఎదుర్కొన్న అంబేద్కర్‌ కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. రాజ్యాంగ హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని విమర్శించారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను అంబేద్కర్‌ స్ఫూర్తితో నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రమణ, వీర్రాజు పాల్గొన్నారు.

 

➡️