అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలి

రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు

ర్యాలీలో పాల్గొన్న మాణికం ఠాగూర్‌

రాజ్యాంగంపై బిజెపికి విశ్వాసం లేదు

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌

ప్రజాశక్తి – గార

రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి, ఎంపీ మాణికం ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు. మండలంలోని అంబటివానిపేటలో గురువారం నిర్వహించిన జై బాపూజీ, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ను అనడం ఫ్యాషన్‌గా మారిందని, వాళ్లు అన్నిసార్లు అనడం కంటే దేవుడు పేరు స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుందని అమిత్‌ షా వ్యాఖ్యానించడం బిజెపి అసలు రంగు బయటపడిందన్నారు. బిజెపి ఫాసిస్టు, నియంతృత్వ విధానానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్నది అంబేద్కర్‌ వల్లే అనే వాస్తవాన్ని మర్చిపోకూడదన్నారు. రాజ్యాంగంపై బిజెపికి, ఆ పార్టీ నాయకులకు విశ్వాసం లేదని విమర్శించారు. పార్లమెంట్‌ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్‌ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో మోడీ, అమిత్‌ షాలకు తగిన బుద్ధి చెప్తారన్నారు. పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ బిజెపి ముసుగులో ఆర్‌ఎస్‌ఎస్‌ పాలన సాగిస్తోందని విమర్శించారు. మనుస్మృతిని అమలు చేస్తూ రాజ్యాంగాన్ని మరుగున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త షేక్‌ మస్తాన్‌ వలీ మాట్లాడుతూ అట్టడుగున ఉన్న తరగతుల ప్రయోజనాలను దెబ్బ తీసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు, మమతా నాగిరెడ్డి, డిసిసి అధ్యక్షులు అంబటి కృష్ణారావు, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి జి.వెంకటరమణ, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పూడి కిరణ్‌, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.వి.ఎల్‌.ఎస్‌ ఈశ్వరి, ఎస్‌సి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️