మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్
- ఎమ్మెల్యే గొండు శంకర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం రూరల్
వ్యవసాయాధారిత మన దేశంలో వ్యవసాయ విద్యార్థులకు అపార అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మండలంలోని నైర వ్యవసాయ కళాశాల 35వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కోర్సులో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే భవిత బంగారుబాట అవుతుందన్నారు. విద్యార్థులు గ్రామాల్లోకి వెళ్లి అవగాహనా సదస్సులు నిర్వహించి నైపుణ్యతను పెంచుకోవాలన్నారు. వరి పంటలో అదనపు పోషక విలువలు జోడించే రకాలను విడుదల చేసే దిశగా పరిశోధన చేయాలని సూచించారు. దేశ ఆహార భద్రతకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇష్టపడి చేసే ఏ పని అయినా మరొకరి సాయం కోసం ఎదురుచూడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలన్నారు. వ్యవసాయశాఖ జెడి కె.శ్రీధర్ మాట్లాడుతూ ఈ కళాశాల విద్యార్థులు వ్యవసాయ, అనుబంధ శాఖల్లో ఉత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం రైతులు సాగులో ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించి పరిశోధన చేయాలని సూచించారు. సభాధ్యక్షులు, నైర వ్యవసాయ కళాశాల డీన్ మాట్లాడుతూ వ్యవసాయ కళాశాల 1989లో ఆమదాలవలసలో స్థాపించబడి, పూర్తిస్థాయిలో 1995లో నైరలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. వ్యవసాయ కళాశాల వ్యవసాయంలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లను తీర్చిదిద్దడమే కాకుండా నాలెడ్జ్, టెక్నాలజీ సెంటర్‌గా పనిచేస్తోందని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తాజా సాంకేతికతలను రైతులకు విస్తరించే కేంద్రమని చెప్పారు. 2022లో ఈ కళాశాల విద్యార్థి కె.విక్టర్పాల్ భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నిర్వహించిన పరీక్షలో ప్లాంటు సైన్స్ విభాగంలో దేశంలోనే మొదటి ర్యాంకును సాధించి ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, న్యూఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. ఈ విజయం జిల్లాకే గర్వకారణమని తెలిపారు. అనంతరం ఐ లవ్ ఎజి కాలేజ్ నైర ఐకాన్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర అన్నదాత విగ్రహానికి పూలమాలలు వేసి రైతు సేవలను గుర్తుచేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, వ్యవసాయ శాఖ ఎడిలు, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి కె.భాగ్యలక్ష్మి, ఆమదాలవలస, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానాల అధిపతులు జి.చిట్టిబాబు, పి.ఉదరుబాబు, నైర, అలికాం సర్పంచ్‌లు అరవల రవీంద్ర, రంధి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు
.