ఆమదాలవలస : వినతిపత్రం అందజేస్తున్న మున్సిపల్ కార్మికులు
- మున్సిపల్ కార్యాలయాల వద్ద కార్మికుల ధర్నా
ప్రజాశక్తి – ఆమదాలవలస, ఇచ్ఛాపురం
మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తాడి సంతోష్, సిఐటియు ఇచ్ఛాపురం మండల కన్వీనర్ రమేష్ కుమార్ పట్నాయక్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపల్ కార్యాలయాల ఎదుట కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పొరుగు సేవల కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తుందని, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తుందని ఆశించి భంగపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ కార్మికులకు రెండో శనివారం, జాతీయ సెలవులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు జాతీయ సెలవులు వర్తింపజేయాలన్నారు. శానిటేషన్ పనులకు పుష్ కాట్స్, బిన్‌లు, ఇతర పనిముట్లు అందజేయాలన్నారు. ఇంజినీరింగ్ ఎన్‌ఎంఆర్ క్లాస్ డ్రైవర్లకు జిఒ నంబరు 36 ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమదాలవలస మున్సిపాల్టీలో పనిచేస్తూ మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు కళ్యాణ్, సింహాచలం రెండు కాళ్లు కోల్పోయిన కల్లేపల్లి శ్రీను కుటుంబ సభ్యులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన కుటుంబానికి రూ.ఐదు లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమదాలవలస మున్సిపల్ మేనేజర్ లకీëనారాయణ బిషోరుకు, ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్‌కి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు కె.తారకేశ్వరరావు, ఎ.శ్రీనివాస్, కె.ఈశ్వరరావు, డి.రాజేష్ పాల్గొన్నారు.