అప్పలరాజుకు పెద్ద శిక్ష పడాలి

గత ఎన్నికల్లో

సమావేశంలో మాట్లాడుతున్న శివాజీ

  • మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ

ప్రజాశక్తి – పలాస

గత ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పాల్పడిన వేధింపులు అంతా ఇంతా కాదని మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ తెలిపారు. తన కుమార్తె గౌతు శిరీషను చాలా వేధింపులకు గురిచేశారని చెప్పారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ శిరీషపై తప్పుడు ప్రచారం, తప్పుడు పోస్టులు పెట్టి వేధిస్తుండడం తో ఒక రాజకీయ నాయకునిగా, ఆడ బిడ్డ తండ్రిగా ఎంతో బాధపడ్డానన్నారు. అరాచకాలు, అవమానాలు, వేధింపులను ఎదుర్కొని శిరీష అప్పలరాజుపై విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. తన కుమార్తెను హింసించిన ఆయనకు అంతకంటే పెద్ద శిక్ష పడాలని కోరుకుంటు న్నానని చెప్పారు. ఓటమిపాలైన అప్పలరాజు అప్పుడే అబద్దాలు చెప్పడం ప్రారం భించారని, ప్రజలు గుణపాఠం చెప్పినా మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆది మ్యాచ్‌గా నిలిచారని కొనియాడారు. దారితప్పిన వ్యవస్థను చంద్రబాబు నాయుడు బాగుచేస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెర వేర్చే బాధ్యత ఆయన తీసుకుంటారని చెప్పారు. కిడ్నీ ఆస్పత్రి ఆలోచన చంద్రబాబుదేనని, అక్కడ స్థలాన్నీ టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసి శంకుస్థాపన చేస్తే, అప్పలరాజు తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. కిడ్నీ ఆస్పత్రి ప్రస్తుతం డయాలసిస్‌ కేంద్రంగానే నడుస్తోందని, పరిశోధన చేసేందుకు ఒక్క పరికరమైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. తన హయాంలో ప్రారంభించిన డయాలసిస్‌ కేంద్రం పరికరాలు ఆస్పత్రిలో పెట్టి, అదే తాము చేసిన అభివృద్ధి అని అప్పలరాజు చెప్తున్నారని విమర్శించారు. పలాసను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడానికి తాను సహకారం అందిస్తానన్నారు. సమావేశం లో టిడిపి నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్‌రావు, లొడగల కామేశ్వరరావు యాదవ్‌, గురిటి సూర్యనారాయణ, గాలి కృష్ణారావు, దువ్వాడ శ్రీకాంత్‌, టంకాల రవిశంకర్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

➡️