జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు

రాష్ట్రంలో ఎన్‌డిఎ

ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం

ప్రజాశక్తి – శ్రీకాకుళం

రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం వద్ద కేసారిపల్లిలో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా ప్రజలంతా వీక్షించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం పది గంటల నుంచి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యక్ష ప్రచారాన్ని వీక్షించేందుకు అధికార యంత్రాంగం నిర్దేశిత ప్రదేశాల్లో తెరలపై వీక్షించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇచ్ఛాపురం రోటరీ క్లబ్‌లో, పలాసలో ఎమ్మెల్యే శిరీష నివాసంలో, టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి ఆదిత్య కళ్యాణ మండపంలో, పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం మండలం కె.ఎస్‌.ఎం ప్లాజాలో, శ్రీకాకుళం నియోజకవర్గంలో సింగుపురంలోని గాయత్రి కళ్యాణ మండపంలో, ఏడు రోడ్ల కూడలిలోని బాపూజీ కళామందిరంలో, ఆముదాలవలస నియోజకవర్గంలో ఆముదాలవలస గాంధీ విగ్రహం సెంటర్‌లో రైల్వేస్టేషన్‌ మెయిన్‌ రోడ్డు వద్ద, ఎచ్చెర్ల నియోజకవర్గంలో రణస్థలంలోని కళ్యాణి వెంకటేశ్వర వేదికలో, నరసన్నపేట నియోజకవర్గంలో నరసన్నపేట జట్టు కళాశాల సంఘం యూనియన్‌ కార్యాలయంలో ఎల్‌ఇడి స్క్రీన్లు, టివిలను ఏర్పాటు చేశారు.

➡️