కళాకారుల ప్రదర్శన
ప్రజాశక్తి – వజ్రపుకొత్తూరు
మరుగున పడిన కళలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పలువరు వక్తలు అన్నారు. నగరంపల్లిలో ప్రజానాట్యమండలి, గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం సంయుక్తంగా నిర్వహించిన జానపద కళామేళా ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంది. అసిరయ్య జానపద ప్రదర్శన, జముకుల పాట, గిడుగు రామ్మూర్తి జానపద కళాపీఠం వ్యవస్థాపకులు, రచయిత బద్రి కుర్మారావు పల్లె పాటలతో అలరించారు. జానపద కళాకారుడు కొండ శ్రీధర్ ఆలపించిన లయబద్ధమైన పాటలతో హోరెత్తించారు. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు ఈశ్వర్ పాత్రో ప్రదర్శన ఆద్యంతమూ ఆకట్టుకుంది. ఆసిరయ్య కళాపీఠం ఏర్పాటు చేసి ఆయన సేవలను ఉత్తరాంధ్ర అంతటా ఉపయోగించుకుంటామని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతిరారు తెలిపారు. భావితరాలకు మన యాస, భాష, ఆట, పాట ద్వారా నైతిక విలువలను పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు నెయ్యల చంద్రయ్య, శిష్టు మనోజ్, సినీ, నాటక, రంగస్థల కళాకారుడు కుమార్ నాయక్, సర్పంచ్ దువ్వాడ మధుకేశ్వరరావు, మాజీ సర్పంచ్ దువ్వాడ జయరాం చౌదరి, సిపిఎం నాయకులు బమ్మిడి ఆనందరావు, నెయ్యల మోహనరావు, ఎంపిటిసి బమ్మిడి మోహనరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.రమణ, జిల్లా కన్వీనర్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.