మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
విశాఖ, విజయనగరం జిల్లాలు ఇసుక కోసం శ్రీకాకుళం జిల్లాపైనే ఆధారపడి ఉందని, జిల్లా నుంచి ఇసుక లభ్యతను మరింత పెంచాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, ఇతర ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవాణా, తవ్వకం, వ్యయభారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలన్నారు. జిల్లాల్లో ఇసుక ధరలపై తరచుగా సమీక్షిస్తామని తెలిపారు. ఇసుక సమస్యలపై ప్రజలు టోల్ ఫ్రీ 18004256012, వాట్సాప్ నంబరు 9701691657ను సంప్రదిం చవచ్చన్నారు. ఇసుక సరఫరా, ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రజల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునేలా వ్యవస్థ పనిచేయాలని ఆదేశించారు. అక్రమ రవాణా చేస్తున్న 11 లారీలను ఇటీవల సీజ్ చేశామన్నారు. నిబంధనలు పాటించకపోతే మరిన్ని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని రీచ్‌ల నిర్వహణ సంస్థలను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఇసుక రవాణాకు బిల్లులు జారీ చేసే విధానం, నకిలీ బిల్లులను గుర్తించే విధానంపై అవగాహన పెంచుకోవాలన్నారు. రీచ్‌లకు కేటాయించిన సిబ్బంది తప్పక అందుబాటులో ఉండాలని, స్థానికుల నుంచి ఇబ్బందులు, ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇసుక లభ్యత ఎక్కువగా ఉంటే ధర తగ్గుతుందని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. ఎడ్ల బళ్లపై ఇసుక తీసుకువెళ్లే వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని, రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు జరగకుండా నిఘా పెంచాలని ఆదేశించారు. అన్ని రీచ్‌ల్లో లైట్లు, కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డిఒలు కృష్ణమూర్తి, సాయిప్రత్యూష, మైన్స్ డిడి మోహనరావు, డిఎస్‌పి వివేకానంద, సిఐలు, తహశీల్దార్లు, రీచ్ నిర్వాహకులు, ట్రాన్స్‌పోర్టు యజమానులు పాల్గొన్నారు.