వినతులను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే శంకర్
- ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే వినతుల స్వీకరణ
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
సమస్యలు తెలుసుకునేందుకు నిరంతరం నియోజకవర్గంలో ప్రజలతోనే ఉంటానని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి చెప్పుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని విశాఖ-ఎ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ప్రజా ర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలో వ్యక్తిగత, సామాజిక అవసరాలను పరిష్కరించాలంటూ పలువురు వినతులు అందజేశారు. గ్రామాల్లో రోడ్లు, కాలువలు, డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని గార, శ్రీకాకుళం మండలాల్లోని పలువురు వినతులు అందజేశారు. గళగళ్లవానిపేట వద్ద సముద్ర తీరం కోతకు గురవుతోందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మత్స్యకారులు విన్నవించారు. చేపల వేట సామగ్రి భద్రపరుచుకునేందుకు గతంలో సముద్రపు దిబ్బలు ఉండేవని, ప్రస్తుతం ఆ సౌకర్యాన్ని కోల్పోయామని వివరించారు. పింఛన్లు, ఇళ్లు మంజూరు చేయాలని పలువురు దరఖాస్తులు అందజేశారు.