మాట్లాడుతున్న సిఐ ఈశ్వరరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అనర్థాలు, చెడు ఫలితాల గురించి వివరించే వినూత్న కార్యక్రమం సంకల్పం అని రెండో పట్టణ సిఐ పి.ఈశ్వరరావు అన్నారు. విద్యార్థి దశ నుంచే మాదక ద్రవ్యాల వాడకం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నగరంలోని చేపల వీధిలో గల ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్‌లో మంగళవారం సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. వ్యసనాలకు గురైతే భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ కోసం ఎన్నో కలలు కంటూ రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించి వ్యయప్రయాసలకోర్చి చదివిస్తున్నారని, వారి కలలు నిజం చేయాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. అందుకోసం క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
.