సూచనలు చేస్తున్న డిఐజి గోపీనాథ్ జట్టి
- విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి
ప్రజాశక్తి – శ్రీకాకుళం
రథసప్తమి వేడుకలకు 2,300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జట్టి తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లను ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. నగరంలోని మిల్లు జంక్షన్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడ్నుంచి అరసవల్లి ఆలయం మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. రోడ్డు మార్గంలో నిలిపిన వాహనాలను త్రోయింగ్ వెహికల్‌తో క్లియర్ చేయించాలన్నారు. ఆలయం సింహద్వారం వద్ద యాత్రికుల రద్దీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయం లోపల ప్రవేశం, తిరుగు వెళ్లే మార్గాలను పరిశీలించి ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి కె.వి రమణ, పి.శ్రీనివాసరావు, డిఎస్‌పి సిహెచ్.వివేకానంద, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు.విధి నిర్వహణ సిబ్బందికి ఎస్‌పి దిశానిర్దేశంఅరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్‌పి మహేశ్వర రెడ్డి దిశానిర్దేశం చేశారు. మొత్తం బందోబస్తుని 20 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. ఎస్‌పి పర్యవేక్షణలో ముగ్గురు ఎఎస్‌పిలు, 15 మంది డిఎస్‌పిలు, 49 మంది సిఐలతో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మొత్తం 2,300 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా నుంచి సుమారు వెయ్యి మంది, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం సిటీ, ఇతర సైడ్ వింగ్‌ల నుంచి 1300 మంది పోలీసులను కేటాయించినట్లు వివరించారు. డ్రోన్, సిసి కెమెరాలను అనుసంధానం చేస్తూ యాత్రికులకు అందుబాటులో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.