కిడ్నీ ఆస్పత్రికి మౌలిక సౌకర్యాలు

కిడ్ని పరిశోధనా

అధికారులతో సమీక్షిస్తున్న ఎమ్మెల్యే శిరీష

ప్రజాశక్తి – పలాస

కిడ్ని పరిశోధనా కేంద్రం, 200 పడకల ఆస్పత్రికి మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. రూ.53 కోట్ల వ్యయంతో భవనాలు నిర్మించి విడిచిపెట్టారని, పరికరాల కోసం రూ.25 కోట్లు మంజూరు కాగా, ఇంకా రూ.11 కోట్ల విలువైన పరికరాలు పూర్తిగా రాలేదని తెలిపారు. ఎపి మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎపిఎంఎస్‌ఐడిసి) అధికారుల బృందం ఎమ్మెల్యేను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కిడ్నీ ఆస్పత్రిలో సౌకర్యాలపై ఎమ్మెల్యే సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత టిడిపి ప్రభుత్వ హయాంలోనే కిడ్నీ పరిశోధనా కేంద్రానికి బీజం పడిందన్నారు. జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ కిడ్నీ ఆస్పత్రి నెలకొల్పాలని సిఫార్సు చేసిన మేరకు దీన్ని అప్పట్లో రూ.50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. వైసిపి ప్రభుత్వం భవనాలు నిర్మించి తామే తెచ్చామని గొప్పలు చెప్పుకున్నారన్నారు. అవసరం మేరకు పరికరాలు లేకుండా, సిబ్బంది నియమకాలు చేపట్టకుండా అప్పటి సిఎం జగన్‌ ప్రారంభించారని విమర్శించారు. కిడ్నీ ఆస్పత్రికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఇఇ సత్యప్రభాకర్‌, డిఇఇ త్రిమూర్తులు, జెఇలు నరేంద్ర, ధనుంజయ, సాయిసురేంద్ర, బి.ఎం దామోదరరావు ఉన్నారు.

➡️