సమగ్ర వివరాలతో సిద్ధంగా ఉండాలి

గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు

మాట్లాడుతున్న పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణమోహన్‌

ప్రజాశక్తి – సరుబుజ్జిలి

గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు తమ పరిధిలో సమగ్ర సమాచారాలతో సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఇ.కృష్ణమోహన్‌ అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. శిక్షణా తరగతులను పరిశీలించిన అసిస్టెంట్‌ కమిషనర్‌ సర్పంచ్‌లు, కార్యదర్శులు హాజరు వివరాలు, మూడు రోజులు ఇస్తున్న శిక్షణపై పలు ప్రశ్నలు వారిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలోని మహిళలు, పురుషుల జనాభా గణాంకాలతో పాటు గ్రామ పంచాయతీ ఆదాయ వనరులు, నిధుల వివరాలను ఏ క్షణాన అధికారులు అడిగినా సమాధానం చెప్పే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న శిక్షణల ద్వారా మరింత అవగాహన పెంపొందించుకుని పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో వాటిని అమలు చేస్తూ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణా మేనేజర్‌ ఎస్‌.లోకనాథం, ఎంపిడిఒ ఎం.రత్నం, సూపరింటెండెంట్‌, మండల పరిషత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

 

➡️