పిహెచ్‌సిల్లో మెరుగైన వైద్యం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో

మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ మీనాక్షి

* అనారోగ్య సమస్యలుంటే సంప్రదించాలి

* పది రోజుల పాటు వృద్ధులకు వైద్య పరీక్షలు

* జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని, అనారోగ్య సమస్యలు ఉంటే అక్కడకు వెళ్లి వైద్యంతో పాటు అవసరమైన మందులు పొందాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి.మీనాక్షి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని మథర్‌ థెరిసా ఆశ్రమంలో వృద్ధులకు ప్రత్యేక వైద్య పరీక్షలను డిసిహెచ్‌ఎస్‌ కళ్యాణ్‌బాబుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా పది రోజుల పాటు వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు పళ్లు పంపిణీ చేసి, వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం నెలకోసారి మానసిక వైద్యులను, రెండుసార్లు సాధారణ తనిఖీలకు సమీప పిహెచ్‌ వైద్య సిబ్బందిని పంపిస్తామన్నారు. మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన మందులు పిహెచ్‌సిల్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

➡️