విగ్రహం వద్ద నివాళ్లర్పిస్తున్న తులసీదాస్, తదితరులు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తులసీదాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాసు అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నగరంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్‌సి, ఎస్‌టిలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ఫెడరిలిజాన్ని బిజెపి ద్వంసం చేస్తుందని విమర్శించారు. మరో వైపు రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో శ్రీకాకుళం జిల్లా గిరిజనులకు ఐటిడిఎ లేకుండా చేశారన్నారు. దీనివల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఐటిడిఎను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమ పథకాలను గత ఐదేళ్లుగా రద్దు చేశారని, వాటిని పునరుద్దరించి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, కె.మోహనరావు, జి.సింహాచలం, పి.తేజేశ్వరరావు, నాయకులు ఆర్.ప్రకాష్, ఎ.లక్ష్మి, ఎం.లలిత, మాతల గోవర్థనరావు పాల్గొన్నారు.