రక్తదాతలతో కలెక్టర్, ఎస్‌పి, జెసి
- పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై దృష్టిసారించాలి
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – శ్రీకాకుళం
పోలీస్ సిబ్బంది చేసిన రక్తదానం అత్యవసర పరిస్థితుల్లో వేరే వ్యక్తి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుందని, రక్తదాతలే ప్రాణదాతలు అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల స్మారక ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం, రిమ్స్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యాన సోమవారం రక్తదానం శిబిరం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి కలెక్టర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా, ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్‌పి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ సిబ్బందితో పాటు యువత, విద్యార్థులు, ప్రజలు ఇలాంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిరంతరాయంగా ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. అమరవీరుల స్మారక ఉత్సవాలు ఈనెల 31వ తేదీ వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్‌పి తెలిపారు. టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ఈనెల 29, 30 తేదీల్లో వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. స్మారక ఉత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు సైబర్ నేరాలు, యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని కోరారు. రక్తదానం చేసిన పోలీస్ సిబ్బందికి ధ్రువీకరణ పత్రాలతో పాటు, రెడ్‌క్రాస్ పతకాన్ని కలెక్టర్, ఎస్‌పి, జెసి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌పి సిహెచ్.వివేకానంద, ఎల్.శేషాద్రి, సిఐలు అవతారం, ఉమామహేశ్వరరావు, సత్యనారాయణ, సూర్యనారాయణ, రెడ్‌క్రాస్ చైర్మన్ బి.జగన్నాథం ప్రతినిధులు చైతన్య కుమార్, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు, జిజిహెచ్ వైద్యాధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.