అధికారులకు సూచనలు ఇస్తున్న డిపిఒ భారతీ సౌజన్య
- పెరుగుతున్న రోగులు
- ఇప్పటివరకు 11 కేసులు నమోదు
- పరిశుభ్రత లోపమే వ్యాప్తికి కారణం
- నాలుగు రోజుల పాటు చేపలు, మాంసం విక్రయాలపై నిషేధం
ప్రజాశక్తి – పొందూరు
పొందూరు మండల కేంద్రంలోని కస్పా వీధిలో డయేరియా విజృంభిస్తోంది. వాంతులు, విరేచనాలతో ఇప్పటివరకు 11 మంది ఆస్పత్రుల్లో చేరారు. మంగళవారం ఐదుగురు రోగులు పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరారు. డయేరియా ప్రబలిన వీధుల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో పంచాయతీ సిబ్బంది ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు, ఫాగింగ్ చేపట్టారు. తాడివలస వైద్యులు రమేష్ నాయుడు, నవీన్ పవన్ కళ్యాణం ఆధ్వర్యాన పిహెచ్‌సి సిబ్బంది రోగులకు ఇంటి వద్ద చికిత్స అందిస్తున్నారు. డయేరియా సోకిన వీధులలో బోరుబావులను నిలిపివేసి, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎంపిడిఒ మన్మథరావు, సర్పంచ్ ఆర్.లక్ష్మి, టిడిపి మండల అధ్యక్షులు చిగులిపల్లి రామ్మోహన్ పరామర్శించారు.
బాధితులకు డిపిఒ పరామర్శడ
యేరియా సోకిన రోగులను, కుటుంబాలను జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య మంగళవారం పరామర్శించారు. వీధుల్లో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. తాగునీటి వనరుల్లో ఎటువంటి కలుషితం లేదని ఆర్‌డబ్ల్యుఎస్ ఎఇ రాజు డిపిఒకు తెలిపారు. లేబొరేటరీల్లో నిర్వహించిన నీటి పరీక్షలను డిపిఒకు అందించారు. వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడమే వ్యాధి తీవ్రతకు కారణమని డిపిఒ గుర్తించారు. నాలుగు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఇఒ మోహన్‌బాబును ఆమె ఆదేశించారు. వీధుల్లో తిరిగి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యాధి తీవ్రతపై వైద్యులతో చర్చించి, వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్య, పంచాయతీ అధికారులతో చర్చించారు.
చేపలు, మాంసం విక్రయాలపై నిషేధండ
యేరియా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో నివారణ చర్యల్లో భాగంగా మండల కేంద్రంలో మాంసం, చేపలు విక్రయాలను పంచాయతీ అధికారులు నిషేధించారు. నాలుగు రోజుల పాటు ఎటువంటి విక్రయాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిపిఒ భారతీ సౌజన్య సూచించారు. త్వరలో సంక్రాంతి పండగ నేపథ్యంలో ఈలోగా వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాధి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఆమెతో పాటు డిఎల్‌పిఒ ఐ.వి రమణ, ఎఒ మిశ్రా తదితరులున్నారు.