విరిగిన ఫ్యాన్‌ రెక్కలు

సార్వత్రిక ఎన్నికల్లో

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు చెల్లాచెదురయ్యాయి. జిల్లాలో కనీసం ఒక్క సీటునూ గెలవలేక ఆ పార్టీ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. మళ్లీ అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు పటాపంచలయ్యాయి. జిల్లాలోని అన్ని స్థానాలనూ గెలవలేకపోయినా కనీసం సగం సీట్లనైనా గెలుచుకుంటామని భావించిన పార్టీ కేడర్‌కు ఊహించని ఫలితాలు షాక్‌కు గురిచేశాయి. వైసిపి ఘోర పరాజయానికి నేతలు నేల విడిచి సాము చేయడమే ప్రధాన కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధి వంటి అంశాలను పక్కనపెట్టి కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుంటే ఫలితం ఎలా ఉంటుందో చవిచూశారు. గడప గడపకూ వెళ్లిన నాయకులు అంతా ఘనంగా ఉందని మురిసిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు ప్రజల్లో ఉండాలంటూ వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన గడప గడపకూ మన ప్రభుత్వమూ బెడిసికొట్టింది. ఇంటింటికీ వెళ్లి ఆ ఇంటిలో ప్రభుత్వం ద్వారా కలిగిన మేలు ఏమిటో లెక్కలతో కరపత్రాలు పంచినా ప్రజలు కనికరించలేదు. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల ఆదరణ బ్రహ్మాండంగా ఉందని, ఇక పార్టీకి తిరిగే లేదనుకుని గెలుపు ఊహల్లో విహరించారు.వైసిపి అభ్యర్థుల ప్రచారమూ సంక్షేమ పథకాల చుట్టూనే సాగింది. ఐదేళ్లలో నియోజకవర్గానికి ఫలానా పనిచేశామని గానీ ఈ కారణాల వల్ల పనులు చేయలేకపోయామని చెప్పిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు పారకపోవడంతో పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు ఇక్కడి నేతలూ మునిగారు. ఆపద్ధర్మ సిఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతి నుంచి గానీ వేరే చోట బహిరంగ సభ నుంచి గానీ బటన్‌ నొక్కడం, ఇక్కడ వైసిపి ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందించడం ఇలా ఐదేళ్లుగా ఇదే తంతు కొనసాగింది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం నుంచి నిధులు రప్పించి నియోజకవర్గం అభివృద్ధి చేద్దామన్న ఆలోచన కనీసం స్ఫురించలేదు. ఎన్నికల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని అతి విశ్వాసం కనబరిచారు. దాని ఫలితమే సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయానికి దారితీసింది.వైసిపి ఓటమికి అటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహంతో పాటు అభ్యర్థుల పైనా అంతేస్థాయి వ్యతిరేకత ఉందన్న చర్చ నడుస్తోంది. వైసిపి ఐదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వంశధార ప్రాజెక్టు దాదాపు 90 శాతం, ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ సుమారు 50 శాతం పూర్తయినా దాన్నీ ఈ ఐదేళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయారు. నదుల అనుసంధానం పనులూ అసంపూర్ణంగానే ఉన్నాయి. జిల్లాలో ఐదేళ్లు పాటు పూర్తి పదవిని అనుభవించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, రెండున్నర ఏళ్ల పాటు మంత్రి పదవిని ధర్మాన గానీ వాటిని పూర్తి చేయకుండా తమ సొంత పనులను చక్క పెట్టుకున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. పలాసలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి,కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినా వైద్యులు, వైద్య సిబ్బంది మౌలిక వసతులు కల్పించలేదు. 2019 ఎన్నికల సమయంలో కాశీబుగ్గ రైల్వే బ్రిడ్జిని పూర్తి చేస్తామని మాజీ మంత్రి ఇచ్చిన హామిని అటకెక్కించారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం తండ్యాం, లైదాంలో కనీసం ఎత్తిపోతల పథకానలు పూర్తి చేయలేకపోయారు. మాజీ మంత్రి ధర్మాన, మాజీ శాసనసభాపతి తమ్మినేని నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే శ్రీకాకుళం ఆమదాలవలస రోడ్డు మూడేళ్లు అయినా పూర్తి చేయకపోవడంతో జనం ఆగ్రహం ఓట్ల రూపంలో కనిపించింది. సొంత ఇమేజ్‌, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఉంటే పార్టీల ప్రభంజనం ఉన్నా నెట్టుకొచ్చిన పరిస్థితిని మనం గతంలో చూశాం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గాలి వీచినా ఇచ్ఛాపురం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా పిరియా సాయిరాజ్‌ ఒక్కరే గెలిచారు. 2019 ఎన్నికల్లో వైసిపి ప్రభంజనంలోనూ టెక్కలి నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇచ్ఛాపురం నుంచి బెందాళం అశోక్‌ విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలో వైసిపి అభ్యర్థులు కొట్టుకుపోయారు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అతి విశ్వాసం, ఎన్నికల్లో ప్రచారంలో వాటిపై తప్ప అభివృద్ధి అంశాల జోలికి వెళ్లకపోవడంతో ఘోరంగా ఓటమిపాలయ్యారు. వీటితో అధికారం ఉందన్న అహకారంతో కొందరు నేతలు నోరుపారేసుకోవడంతో ఎన్నికల్లో జనం ఛీత్కరించారు. కూటమి తరుపున కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వైసిపి నేతల ఘోర ఓటమిని గుణపాఠంగా తీసుకుని ప్రజా సమస్యలు, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారిస్తారని ఆశిద్దాం.

➡️