బుద్ధదేవ్ చిత్రపటానికి నివాళ్లర్పిస్తున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి – శ్రీకాకుళం, కొత్తూరు
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం సీనియర్ నాయకులు బుద్ధదేవ్ భట్టాచార్య మృతి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి అన్నారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో బుద్ధదేవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమంతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా, 2000-11 మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారని చెప్పారు. 1966లో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై, అదే ఏడాది సిపిఎంలో చేరి అంచెలంచెలుగా పొలిట్‌బ్యూరో స్థాయికి ఎదిగారని తెలిపారు. రచయిత అయిన ఆయన బెంగాలీ సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేశారని కొనియాడారు. మూడు దశాబ్దాల పాటు బెంగాల్ వామపక్ష ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఆయన మరణంతో ఒక అధ్యాయం ముగిసిందన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె.మోహనరావు, వి.జి.కె మూర్తి, ఎం.ఆదినారాయణమూర్తి, ఎ.సోమశేఖర్, ఆర్.ప్రకాష్, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కొత్తూరులో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యాన బుద్ధదేవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్, నిమ్మక అప్పన్న, రమేష్, లక్ష్మి, మాలతి తదితరులు పాల్గొన్నారు.