రోడ్డు పనులను పరిశీలిస్తున్న పీడీ సుధాకరరావు
డ్వామా పీడీ బి.సుధాకరరావు
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
ఇంజినీరింగ్ విభాగం సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పల్లె పండగ రహదారి పనులను నెలాఖరులోగా శత శాతం పూర్తి చేయాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సుధాకరరావు ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులో పల్లె పండుగ నిధులతో నిర్మిస్తున్న సిమెంట్ రహదారి పనులతో పాటు గోకులం నిర్మాణ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ సిబ్బంది నిర్మాణాత్మక ధోరణితో విధులు నిర్వహించాలని మండల స్థాయి సిబ్బంది ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను అధిగమించాలన్నారు. గోకులాల నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. ఇంకుడుగుంతలు, ఇతర మెటీరియల్ కాంపోనెంట్ పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా మండలాల్లో కూలీలకు ఉపాధిని చూపించాలని, పని కోరిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలన్నారు. కూలీలకు ప్రయోజనం చేకూరే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశీలనలో మండల ఇంజినీర్ పి.బాల ముకుంద, టిఎ నాగమణి, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.